ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ సుమారు 40 ఏళ్లకుపైగా జర్నలిస్టు సంక్షేమం కోసం కృషి చేసిన సీనియర్ జర్నలిస్టు అంబటి ఆంజనేయులు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో కన్వీనర్ పయ్యావుల ప్రవీణ్ అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో అంబటి ఆంజనేయులు సంతాప సభ నిర్వహించారు. ఇందులో భాగంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జగదీష్, వైసిపి నాయకులు ఈశ్వరయ్య మాట్లాడుతూ అంబటి ఆంజనేయులు జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసిన సేవలను ఆదర్శనీయంగా నిలిచాయని కొనియాడారు. ఉద్యమకారుడిగా పేరుగాంచిన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఏ వృత్తిలోనైనా పని చేస్తున్న వారు సమస్యల పట్ల కొంతకాలం వరకు నాయకులుగా పనిచేస్తారని తెలిపారు. అంబటి ఆంజనేయులు తమ వ్యక్తిగత జీవితాలను పక్కన పెట్టి జర్నలిస్టుల సమస్యల కోసం 40 ఏళ్లుగా చివరి క్షణం వరకు ఉద్యమిస్తూ జర్నలిస్టులకు సంక్షేమ ఫలాలను అందించిన వ్యక్తి అన్నారు. ఆయన ఆశయాలను మనం కొనసాగించడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయరాం, కో కన్వీనర్ ఆయూబ్‌బాషా, కమిటీ సభ్యులు చలపతి, కెపి.కుమార్, చౌడప్ప, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రసూల్, సీనియర్ జర్నలిస్టులు మార్కండేయులు, ఆనందవర్ధన్, బికారి, రామ్మూర్తి, మల్లికార్జున, భీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంబటికి నివాళులర్పిస్తున్న నాయకులు, జర్నలిస్టులు










