Oct 22,2023 21:02

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణలో పాల్గొన్న స్పీకర్‌ సీతారాం

* శాసనసభ స్పీకర్‌ సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస: 
అంబేద్కర్‌ అందరివాడు అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని గాజుల కొల్లివలసలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన హక్కులను కల్పించారన్నారు. అంబేద్కర్‌ను ఎల్లవేళలా స్మరించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. అంబేద్కర్‌ నేటితరానికి ఆదర్శప్రాయుడన్నారు. బాల్యం నుంచి వివక్ష ఎదుర్కొంటూ రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలకపాత్ర పోషించారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌ అని అన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సర్పంచ్‌ ప్రతినిధి మొండేటి కూర్మారావు, మాజీ కౌన్సిలర్‌ దుంపల శ్యామలరావు, దళిత నాయకులు పాల్గొన్నారు.