Oct 21,2023 21:03

పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ప్రజాశక్తి-నెల్లూరు:విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పోలీస్‌ గ్రౌండ్‌ లో జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణదినోత్సవ కార్యక్రమంలో మంత్రి గోవర్ధన్‌ రెడ్డి, కలెక్టర్‌ ఎం హరి నారాయణ, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ, మేయర్‌ స్రవంతి,ఎంఎల్‌సి బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, ఎస్‌పి డాక్టరు కె తిరుమలేశ్వర్‌ రెడ్డి, పలువురు పోలీసు అధికారులు పాల్గొని అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు వుంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు నిత్యం రక్షణ కల్పిస్తూ పోలీసులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నారు. ఏ వ్యక్తి అయినా నిర్ణీత పని వేళలు, పని దినాలు ఉండాలని కోరుకుంటాడని, ఇందుకు భిన్నంగా 24 గంటలు విధి నిర్వహణలో ఉండే ఏకైక వ్యక్తి పోలీస్‌ మాత్రమే అన్నారు. సమాజంలో సంపన్నుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు పోలీసు సేవలు అత్యవసరమన్నారు.
1959లో చైనా దురాక్రమణ సంఘటనను పురస్కరించుకొని పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులకు అండగా నిలవాలని, వారికి మరింత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేళకు భోజనం, నిద్ర లేకుండా, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే తీరిక లేకుండా నిరంతరం సమాజానికి రక్షణగా ఉంటున్న పోలీసుల సేవలు వెలకట్టలేని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో జరిగిన చిన్న పొరపాటును పోలీసు వ్యవస్థపై ఆపాదిస్తూ విమర్శలు చేయడం సరికాదన్నారు. పోలీసులకు ఒకరి కితాబు అవసరం లేదని, సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోదలచిన, గౌరవం ఇవ్వాల్సిన, గౌరవం పొందాల్సిన మొట్టమొదటి వ్యక్తి పోలీసు అని ఆయన చెప్పారు. దేశ రక్షణకు సరిహద్దుల్లో ఆర్మీ, మిలిటరీ అధికారులు పహారాకాస్తుంటే, దేశంలో అంతర్గతంగా సామాన్యుడికి సంపూర్ణ భద్రత పోలీసులు ఉన్నారన్నారు. జిల్లాలో 18 మంది పోలీసులు ఈ ఏడాది అమరులయ్యారని, వీరికి నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పోలీసుల సేవలను గుర్తించి ప్రోత్సహిస్తున్నారని, వారాంతపు సెలవలు సైతం మంజూరు చేశారన్నారు. జిల్లాలో ఎస్‌పి, కలెక్టర్‌ ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ప్రశాంతంగా ఉందని, సమర్థవంతంగా పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
నిరంతరం సేవ చేసేది పోలీసులు
కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఖచ్చితమైన ఒక చట్టభద్రత ఉండాలని లక్ష్యంతో సైన్యాన్ని, పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఎండనక, వాననక నిరంతరం సమాజ భద్రత కోసం పనిచేస్తున్న పోలీసులను గౌరవించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎందరో పోలీసులు వారి జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసి ప్రాణ త్యాగాలు చేశారని, జిల్లాలో 18 మంది ఈ ఏడాది అశువులు బాసారని, వీరందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఎస్‌పి డాక్టరు కె. తిరుమలేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌ లోని లడక్‌ లో చైనా దురాక్రమణ ఘటనలో రక్తం గడ్డకట్టే చలిలో పదిమంది మన దేశ జవాన్లు పోరాడి మరణించారని, వారి జ్ఞాపకార్ధంగా అక్టోబర్‌ 21న పోలీస్‌ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. దేశ రక్షణకు మిలటరీ జవాన్లు వీరోచితంగా పోరాటం చేస్తుంటే, సమాజంలో ఉగ్రవాదం, ఫ్యాక్షనిజం, అసాంఘిక శక్తులను నిలువరించి ప్రజలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా 188 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారని, పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ, వీరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సంధర్బంగా అమర వీరుల గౌరవార్థం తలలు వంచి సెల్యూట్‌ చేశారు.వారి ఆత్మ కు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెక్కులను,బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చివరగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు పేరెడ్‌ గ్రౌండ్‌ నుంచి ఆర్‌టిసి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎస్‌పి డాక్టరు కె.తిరుమలేశ్వరరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం .చిరంజీవి రెడ్డి, పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.