Jul 05,2023 22:21

ప్రజాశక్తి - ఆచంట
               అమ్మఒడి పథకం పేద విద్యార్థుల పాలిట గొప్ప వరమని ఆచంట ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు. కొడమంచిలి హైస్కూల్లో బుధవారం అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జగనన్న గోరుముద్ద ద్వారా వారికి పౌష్టికాహారం అందిస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వదిలేయకుండా వారు ఎలా చదువుతున్నారో ఎప్పటికప్పుడు వాకాబు చేయాలని కోరారు. కేవలం ఒక నియోజకవర్గంలోని విద్యార్థులకు అమ్మఒడి ద్వారా రూ.31.19 కోట్లు నేరుగా తల్లుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ సుంకర ఇందిరా సీతారామ్‌, ఆచంట మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌, ఉపసర్పంచి ములగాడ వరప్రసాద్‌, రైతు సంఘం అధ్యక్షులు మన్నె సుబ్బారావు, ఆలయ ఛైర్మన్‌ బాలనాగు, నరేష్‌, పెదమల్లం సర్పంచి దిరిశాల విజయలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు యల్లమెల్లి బేబీ రాజేష్‌, ఏడిద రామలక్ష్మి, గ్రామ కమిటీ అధ్యక్షులు సాక సురేష్‌, వైసిపి సెల్‌ మండల అధ్యక్షులు కొండేటి రమేష్‌, ఎంపిడిఒ జగన్నాధరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీరవాసరం : తమ హక్కుల కోసం ఉద్యమాలు చేసే ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్‌ పట్ల కూడా అంతే శ్రద్ధతో విద్యాబోధన చేయాలని భీమవరం ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. జగనన్న అమ్మఒడి మండల స్థాయి కార్యక్రమాన్ని బుధవారం వీరవాసరం ఎంఆర్‌కె జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఎంఆర్‌కె హైస్కూల్‌లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయుల తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరవాసరం విద్యాదాతగా ఉన్న ఎంఆర్‌కె హైస్కూల్‌లో విద్యాభోదన ఈ విధంగా ఉండటం సిగ్గుచేటన్నారు. వీరవాసరం మండలంలో సుమారు రూ.66 కోట్లు విద్యకు కేటాయించినట్లు తెలిపారు. తల్లితండ్రులు, విద్యార్థుల ఆలోచనకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఒ ఆర్‌.వెంకటరమణ, ఎంపిపి వీరవల్లి దుర్గాభవాణి, ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ గొలగాని సత్యనారాయణ, సర్పంచులు చికిలే మంగతాయారు, వీరవల్లి శ్రీనివాసరావు, గెడ్డం భారతి, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ చుండూరు ముసలయ్య, నూకల కనకారావు, కాశీ, తహాశీల్దార్‌ సుందరరాజు, ఎంపిడిఒ జ్యోతి, ఎంఇఒ ఎంఎన్‌.శ్రీమన్నానారాయణ, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
పెనుమంట్ర : జగనన్న అమ్మఒడి మండల స్థాయి కార్యక్రమం పెనుమంట్ర హైస్కూలులో ఎంఇఒ ఉంగరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సర్పంచి తాడిపర్తి ప్రియాంక అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి కర్రి వెంకటనారాయణరెడ్డి (వాసురెడ్డి) మాట్లాడుతూ మండలంలోని 4,883 లబ్ధిదారులకు అమ్మఒడి సొమ్ము జమ అయినట్లు తెలిపారు. సర్పంచి తాడిపర్తి ప్రియాంక మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీసుభాషిణి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, తహశీల్దార్‌ దండు అశోక్‌ వర్మ, ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జి, ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయాల సిబ్బంది, పాఠశాల విద్యాకమిటీల ఛైర్మన్‌, సభ్యులు, మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.