May 09,2023 21:48

వడ్డిపల్లి ఫామ్‌లో ఉన్న గాడిదలు

         అనంతపురం ప్రతినిధి : 'సదువుకోకపోతే గాడిదలుకాయాలిరా'.. అనే మాటలను చిన్నప్పుడు అందరూ వినే ఉంటాం. పని చేయకుండా సోమరిగా ఉండేవారిని గాడిదలు కాయరా అనే సంబోధించేవాళ్లం. ఇది గతం.. ఇప్పుడు ఏకంగా గాడిద పెంపకం కేంద్రాలు ఆవిష్కృతం అయ్యాయి. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా అనంతపురం కేంద్రంగా గాడిదల పెంపకం చేసే ఫామ్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు. ఇది వినడానికి వింతగానూ, ఆశ్చర్యంగానూ ఉండవచ్చు. అనంతపురం జిల్లాకు చెందిన ఒక యువజంట ఈ గాడిదల పెంపక వ్యాపారాన్ని ప్రారంభించింది. గాడిదల పాలు, మాంసంలోనూ ఔషధ గుణాలున్నాయన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇటువంటి ఫామ్‌లు వెలుస్తుండటం గమనార్హం. అయితే గాడిదపాలలో ప్రత్యేకమైన ఔషధ గుణాలేవీ లేవని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయినా వీటి పెంపెకం మాత్రం వ్యాపారాత్మకంగా మారుతోంది.
వడ్డిపల్లిలో గాడిదల ఫామ్‌
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని వడ్డిపల్లి సమీపంలో వెంకటేశ్వర్లు, తేజశ్విణి అనే యువజంట ఏడు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని అందేలో గాడిదల ఫామ్‌ను ఏర్పాటు చేశారు. గాడిదలు మూడు నాలుగు రకాలుంటే ఇక్కడ వీరు పెంచుతున్న రకమైన హలేరీ రకం గాడిద. దీన్ని గుజరాత్‌ రాష్ట్రంలో ఒక్కో గాడిదను రూ.1.50 లక్షల వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ రకంగా 28 గాడిదలను ఈపామ్‌లో ఉంచారు. చుట్టూ ప్రహరీతోపాటు, ఆవుల షెడ్‌లాగా వీటికి ప్రత్యేకంగా ఒకషెడ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.50 లక్షల వరకు పెట్టుబడిని ఈ యువ జంట పెట్టింది. వీటి సంరక్షణకు ప్రత్యేకంగా కొంత మందిని నియమించారు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడిన వీెరికి రాబడి ఏ మేరకు అన్నది సందేహాస్పదంగానే ఉంది. లీటరు పాలు రెండు వేల వరకు పలుకుతున్నప్పటికీ రెగ్యులర్‌గా ఈ పాలను కొనేవారు లేరని పామ్‌ యజమానులు చెబుతున్నారు. తమకు ప్రోత్సహం అందివ్వాలని కోరుతున్నారు
డిమాండ్‌ ఉంటుందని పెట్టాం
వెంకటేశ్‌ ఫామ్‌ యజమాని

కోవిడ్‌ సమయంలో మా ఇంట్లో ఒకరు అనారోగ్యం గురై అస్మా లక్షణాలు కనిపించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే ఈ పాలను తాపించాం. ఆరోగ్యం కొంత మెరుగైనట్టు అనిపించింది. ఈ సమయంలోనే తాము ఈ వ్యాపారంపై దృష్టి పెట్టాం. ఉత్తారాదికెళ్లి అక్కడ కొన్ని చోట్ల ఉన్న ఇటువంటి ఫామ్‌ను పరిశీలించాం. ఇక్కడ పెడితే బాగుంటుందని భావించి ఏర్పాటు చేశాం. పాలు అయితే వస్తున్నాయి. కాని మార్కెటింగ్‌ లేదు. మాలాగానే రాష్ట్రంలో మరికొంత మంది వీటిని ఏర్పాటు చేశారు. ఫుడ్‌ సేప్టీ స్టాండర్డ్సు అథారిటి ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ అనుమతులొస్తే షాపింగ్‌ మాల్స్‌లో పెట్టి ఈ పాలను ఇతర పాలతో సమానంగా అమ్మేందుకు అవకాశముంటుంది. అదే రకంగా పాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించేందుకు వీలుంటుంది. చాలా రిస్కు చేసి ఈ వ్యాపారంలోకి దిగాం. ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రోత్సహం లభించాలని కోరుకుంటున్నాం.
భిన్నమైన వాదనలు
ఈ గాడిదల ఫామ్‌ గురించి తెలిసి అధికారులే విస్మయం చెందారు. ఇటువంటి ఆలోచన రావడం, పెంపకం చేపట్టడం విని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. గతంలో బ్రూక్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ గాడిల సంరక్షణపై సదస్సు ఏర్పాటు చేసిన సమయంలో ఈ వినూత్న ప్రయత్నం అంశం చర్చకు వచ్చింది. పాలల్లోనూ ఔషధ గుణాలున్నాయన్న చర్చపై పశుసంవర్ధక శాఖ అధికారుల్లోనూ భిన్నమైన వాదనలున్నాయి. ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ జరగలేదని చెబుతున్నారు.