జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు
ప్రజాశక్తి - భీమవరం
విశాఖపట్నంలో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో అమిత్ షా గోబ్యాక్ గోబ్యాక్ అంటూ చేసిన నిరసనలు హోరెత్తాయి. అమిత్ షా, బిజెపి పెద్దలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కులేదని, రాష్ట్రానికి అన్యాయం చేశారని సిపిఎం నేతలు విమర్శించారు. భీమవరం మెంటేవారితోట సిపిఎం కార్యాలయం వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపి ప్రభుత్వం, అమిత్ షా రాష్ట్రంలో ఎలా పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖస్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టి, రైల్వేజోన్, ప్రత్యేక హాదా పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వకుండా ఆంధ్రులకు తీరని ద్రోహం చేసిందన్నారు. అమిత్ షాకు ఆంధ్రాలో అడుగుపెట్టే హక్కులేదన్నారు. ఆయన పర్యటనను ప్రజలంతా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బి.వాసుదేవరావు, ఎం.వైకుంఠరావు, పట్టణ కమిటీ సభ్యులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కార్యర్తలు పాల్గొన్నారు.
తణుకు రూరల్ :తొమ్మిదేళ్ల మోడీ పాలనలో ఎపికిి అన్యాయం చేసిన బిజెపి అగ్రనేత అమిత్ షా గో బ్యాక్ అని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి. ప్రతాప్, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు అన్నారు. ఆదివారం స్థానిక వెంకటేశ్వర సెంటర్ వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడానికి నేడు విశాఖ వస్తున్న అమిత్ షా గో బ్యాక్ అంటూ నల్ల రిబన్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్, నాగరాజు మాట్లాడుతూ మోడీ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రానికి, దేశానికి చేసిందేమిలేదని విమర్శించారు. ఈ తొమ్మిదేళ్లు ప్రజలు ఆస్తులైన ప్రభుత్వరంగాలను అంబానీ, అధానీలకు దారధత్తం చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలపై భారాలు వేసి, కార్పొరేట్లకు వరాలు ఇచ్చిన ఘనుడు మోడీ అన్నారు. ఎపికి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా వంటివి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 32 మంది బలిదానాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా మోడీ అమ్మకానికి పెట్టారని గుర్తు చేశారు. బిజెపి వల్ల ఈ దేశానికి ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు గార రంగారావు, కామన మునిస్వామి, బొద్దాని మురళీకృష్ణ, కోరాడ సుధీర్‌బాబు, ఎన్.అప్పారావు, ఎన్.రాధాకృష్ణ, బి.కృష్ణ కిషోర్, నర్సింహారావు, పిడి.మూర్తి, ఎన్.శివ, రాంప్రసాద్, సుగుణరావు, పి.భాస్కరరావు, నాగరాజు పాల్గొన్నారు.










