
* వంశధార ఆధునికీకరణ ఫైల్‌కు క్లియరెన్స్ తీసుకురాలేని వైనం
* షట్టర్ సమస్యకూ చొరవ చూపని మంత్రి అప్పలరాజు
* శివారు భూములకు సాగునీటి సమస్య పునరావృతం
* సాగు నీరివ్వలేకపోయారంటూ అధికారులపై నిందలు
పంట కాలువలు పటిష్టంగా ఉండి నీరు సాఫీగా ప్రవహించే అవకాశం ఉంటే చిట్టచివరి భూమి వరకు సాగునీరందుతుంది. దీంతో పాటు కాలువలపై నిర్మించిన షట్టర్లు సరియైన స్థితిలో ఉంటే సాగు నీటి ప్రవాహానికి అడ్డే ఉండదు. వంశధార కుడి, ఎడమ కాలువలకు ప్రస్తుతం ఇవే లోపించాయి. కాలువల ఆధునికీకరణ, షట్టర్ల సమస్య, గుర్రపు డెక్క, పూడిక వంటి సమస్యలపై చాలా ఏళ్ల నుంచి ప్రభుతానికి అధికారులు మొరపెట్టుకుంటున్నా స్పందన లేకపోవడంతో శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి ఈ ఏడాదీ పునరావృతమైంది. ప్రభుత్వస్థాయిలో పరిష్కారించాల్సిన ఈ సమస్యలను నాలుగున్నరేళ్లుగా విస్మరించి సాగునీరందించడంలో విఫలమయ్యారంటూ మత్స్యశాఖ, పశుసంవర్థక మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులపై నిందించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : హిరమండలం మండలం గొట్టా బ్యారేజీ నుంచి నీటిని విడిచిపెడుతున్న ఎడమ కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. ఎడమ కాలువ ద్వారా 2,480 క్యూసెక్కుల నీరు విడిచి పెట్టేలా కాలువను డిజైన్ చేశారు. 40 ఏళ్ల కిందట రాతితో నిర్మించిన నిర్మాణాలు ప్రస్తుతం దెబ్బతినడంతో ఎడమ కాలువ సామార్ధ్యం అంతకంతకూ తగ్గిపోతోంది. ఎడమ కాలువను ఆధునికీరించాల్సిన అవసరం ఉందంటూ గత తొమ్మిదేళ్లుగా అధికారులు ప్రతిపాదనలు పంపుతునే ఉన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మొదటి సారి పంపారు. 2021 మార్చిలో రూ.776 కోట్లతో, 2022 నవంబరులో రూ.954 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కాలువ ఆధునికీరణ పనులు జరిగి ఉంటే పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని శివారు భూములకూ సాగునీరు అందేది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రిగా పనిచేస్తున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు ఈ ఫైల్‌కు క్లియరెన్స్ తీసుకురావడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి
షట్టర్ల సమస్యపై ఏదీ చొరవ?
నరసన్నపేట వంశధార డివిజన్‌లో 2009లో చోటు చేసుకున్న షట్టర్ల కొనుగోళ్ల అవినీతిపై సిఐడి కేసు నమోదు చేసింది. దీనిపై నేటికీ హైకోర్టులో విచారణ సాగుతోంది. విచారణ పెండింగ్‌లో ఉండటంతో కాలువలపై కొత్త షట్టర్లను ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొత్తగా షట్టర్లు ఏర్పాటు చేసుకోలేక, పాడైన వాటితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. అదీగాక హిరమండలం, నరసన్నపేట, టెక్కలి గొడౌన్లలో రూ.4 నుంచి రూ.5 కోట్ల విలువ చేసే షట్టర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ అంశంపై వంశధార ఇంజినీరింగ్ అధికారులు అనేక పర్యాయాలు మంత్రి అప్పలరాజుతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి జగన్ మాత్రమే పరిష్కరించగలిగిన ఈ సమస్యను మంత్రి అప్పలరాజు ఏనాడూ సిఎం దృష్టికి తీసుకువెళ్లలేదు. ఇరిగేషన్ సెక్రటరీతో మాట్లాడానంటూ వ్యవసాయ సలహా మండలి గత రెండు సమావేశాల్లో చెప్పుకొచ్చారు.
మూడేళ్లు బిల్లులు చెల్లించని ప్రభుత్వం
వంశధార కుడి ఎడమ కాలువలపై కేటగిరి 'ఎ' కింద వివిధ రకాల పనులు చేపట్టారు. జంగిల్ క్లియరెన్స్, పూడిక తీత, స్ట్రక్ఛర్ల నిర్మాణాల కోసం 2021-22లో రూ.4.4 కోట్లతో పనులు చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కొత్తగా పనులు చేసేందుకు ఒక్క కాంట్రాక్లరూ ముందుకు రావడం లేదు.
జిల్లా నిధుల నుంచే గుర్రపుడెక్క తొలగింపు పనులు
కాలువల్లో పెద్ద ఎత్తున గుర్రపుడెక్క పేరుకుపోవడంతో నీరు సాఫీగా ప్రవహించని పరిస్థితి ఏటా తలెత్తుతోంది. ప్రభుత్వానికి నిధులు అడుగుతున్నా విడుదల చేయకపోవడంతో జిల్లా అధికారులు వివిధ రకాల ఫండ్స్ నుంచి అత్యవసరంగా నిధులు మంజూరు చేస్తున్నారు. గుర్రపుడెక్క తొలగింపునకు ఈ ఏడాది జూలైలో రూ.40 లక్షలు ఇచ్చారు. 2022 జూలైలో రూ.44 లక్షలు, ఆగస్టులో 19.5 లక్షలు కేటాయించారు. 2021లో రూ.15 లక్షలు విడుదల చేశారు. కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపుతో ఆ మాత్రమైనా నీరందించగలుగుతున్నారు.
రెండేళ్లు కాలువ అభివృద్ధి పనులు పెండింగ్
ఎడమ కాలువ ద్వారా శివారు భూములకు సాగు నీరందించాలంటే తాత్కాలికంగానైనా అభివృద్ధి పరచాల్సిన అవసరముందని వంశధార ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి 2021 జూలైలో ప్రతిపాదనలు పంపారు. కాలువ సామార్థ్యం పెంపు కోసం ముఖ్యమైన స్ట్రక్చర్స్, పూడికతీత తొలగింపునకు ఎడమ కాలువ కోసం రూ.5.5 కోట్లు, కుడి కాలువ కోసం రూ.4.5 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారు. రెండేళ్లు గడచినా వాటికీ దిక్కులేకుండా పోయింది.
రైతుల ఆగ్రహాన్ని అధికారులపై నెట్టే ప్రయత్నమేనా?
జిల్లాలో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు వంశధార నీరు రాక పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పలాస నియోజకవర్గానికి చెందిన కొంత మంది రైతులు టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి గౌతు శిరీషతో కలిసి ఈ నెల 16న స్పందనలో కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతో అసహనానికి గురైన మంత్రి అప్పలరాజు అధికారులను లక్ష్యంగా చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 20న కలెక్టరేట్‌లో నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో అధికారులపై విరుచుకుపడ్డారన్న చర్చసాగుతోంది. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉండి, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు చొరవ చూపకుండా అధికారులను నిందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.