
* మాజీ జెడ్‌పిటిసి ఆనెపు రామకృష్ణ ఫిర్యాదు
* 'స్పందన'కు 260 వినతులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ పరిధిలోని జగన్నాథ స్వామి ఆలయ భూములను పరిరక్షించాలని మాజీ జెడ్‌పిటిసి ఆనెపు రామకృష్ణ, సర్పంచ్ వరలక్ష్మి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌ను కోరారు. ఆలయ భూములను జిరాయతీ భూములుగా రీ సర్వే సమయంలో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 260 వినతులు వచ్చాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ వినతులు స్వీకరించారు. నరసన్నపేట పట్టణంలోని శివాజీ నగర్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కొందరు అథికార పార్టీకి చెందిన నాయకులు భవనాలు నిర్మిస్తున్నారని, ఈ ఆక్రమణలను తొలగించాలని ఎం.రామారావు ఫిర్యాదు చేశారు. గార మండల కేంద్రంలో జనావాసాల నడుమ మద్యం దుకాణాన్ని నిర్వహిస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే దుకాణాన్ని తొలగించాలని దుర్గారావు, కిషోర్, చలపతిరావు, రామకృష్ణ తదితరులు వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళం నగరంలోని చాపురం, బలగ, సిద్దిపేట ప్రాంతాల్లో కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని, ఈ ఆక్రమణలను తొలగించాలని ఎస్.లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.
ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కారం
స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాల్లో వస్తున్న ఫిర్యాదులపై అలసత్వం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితర సమస్యలపై శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదుదారుడు ఇచ్చిన వినతుల్లో సమగ్రత లోపిస్తే ఆయనకు పూర్తి సమాచారాన్ని అందించి తిరస్కరించడానికి గల కారణాలు తెలియజేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు, సమగ్ర శిక్ష ఎపిసి జయప్రకాష్ డ్వామా పీడీ చిట్టిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.