అలసత్వరతో మెట్ట ప్రాంతంలో నిరుద్యోగం
ప్రజాశక్తి-ఉదయగిరి : స్వాతంత్య్రానంతరం 75 సంవత్సరాలకు కూడా నాయకుల అలసత్వంతో మెట్టప్రాంత నిరుద్యోగ యువతకు శాపంగా మారాయని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కటారి అజరు కుమార్ విమర్శించారు. బుధవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో రెండవ రోజు సిపిఎం పాదయాత్రలో భాగంగా ఉదయగిరిలో చేరుకున్న సిపిఎం పాదయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముప్పవరపు వెంకయ్యనాయుడు నుండి అనేకమంది రాజకీయ నాయకులు ఇక్కడ నుండే మంత్రులుగా రాజకీయం ప్రాతినిథ్యం వహించారు గానీ సాగు, తాగునీరు ఉపాధి కోసం ప్రయత్నించిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ జిల్లాగా విశాఖ జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా ప్రధానంగా ఉందని 38 మండలాలతో నేడు మెట్ట జిల్లాగా మిగిలిపోయిందని దుయ్యబట్టారు. ప్రాంతానికి ఒక్క ఫ్యాక్టరీ లేక కృష్ణపట్నం ఓడరేవుతో సహా అన్ని ఫ్యాక్టరీలు తిరపతి జిల్లాకు పోయాయని ఒక్క ముఖద్వారం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మంత్రి గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డిని మెట్ట ప్రాంతాలలో నిరుద్యోగ నిర్మూలనకు ఫ్యాక్టరీ నిర్మించాలని అడిగామని తెలిపారు. నారాయణపేటకు శాంక్షన్ అయిన ఒక్క ఫ్యాక్టరీని దక్కించుకోలేక బద్వేల్‌కు జగన్మోహన్ రెడ్డి జిల్లాకు పోయిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రాంత ప్రజలపై ఇంత నిర్లక్ష్యం ఏమిటని సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నామన్నారు. ఉదయగిరి ప్రాంత విద్య, వైద్యం కోసం ఉదయగిరి నుండి నందవరం రోడ్డు ఉదయగిరి నుండి బిజ్జంపల్లి ఘాట్ రోడ్డును ఇంతవరకు నిర్మించకపోవడం దుర్మార్గమన్నారు. ఉదయగిరి పట్టణంలో ఆనకట్ట ఆధునికీకరణ అంటూ విస్తీర్ణం కుదించారని బ్రిటీష్ కాలం నిర్మించిన పాఠశాలలో విద్యార్థులకు బోధన చేయడం బాధాకరమన్నారు. ఇంతవరకు విద్యార్థులకు అటాచ్ హాస్టల్ నిర్మించుకోవడం దురదృష్టకరమన్నారు. ఉదయగిరి చుట్టుపక్కల ప్రజలకు ప్రధానమైన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం సిబ్బంది లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిపిఎం చేపట్టే పాదయాత్ర ప్రజల ఓట్ల కోసం కాదని రాబోతున్న ఎలక్షన్‌కు మేక పులి వేషంతో మన ముందుకు వస్తున్న వారిని నియోజకవర్గ అభివృద్ధిపై ప్రశ్నించడానికి చైతన్యవంతులు చేసేందుకు సిపిఎంగా ఈ పాదయాత్ర చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై విద్య, వైద్యం వలసలు నివారణకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఓట్లను అభ్యర్థించే అభివృద్ధి గురించి గళం విప్పాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ పాదయాత్రతో ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించామని 13న జిల్లాకు చేరుకొని పై సమస్యలన్నింటిపై దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం పలువురు వక్తలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ చేపట్టిన డిమాండ్‌లను వివరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మూలి వెంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ముత్యాల గురునాథం, లక్ష్మీపతి, ఎం.పుల్లయ్య జిల్లా నాయకులు కాకు వెంకటయ్య, మండల సిపిఎం నాయకులు ఫరిద్దీన్‌భాషా, డివైఎఫ్‌ఐ నాయకులు నరసింహ, నాయబ్ తదితరులు పాల్గొన్నారు.










