నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్‌రెడ్డి - నిట్‌లో ముగిసిన ఉల్కన్ జి ఉత్సవాలు
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
ఆలోచనలకు పదునుపెడితే అద్భుత ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని, విద్యార్థులు విజయాలే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టాలని ఎపి నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్‌రెడ్డి తెలిపారు. నిట్ ప్రాంగణంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సాంకేతిక, సాంస్కృతిక ఉత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ముఖ్యమేనన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ సాకారం చేసేందుకు విద్యార్థులు సమిష్టిగా పని చేయాలన్నారు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబించేలా విభిన్న పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు ప్రాంగణ ఎంపికల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. యువత నచ్చిన వృత్తుల్లో రాణించాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని, ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వివరించారు. విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్‌షో, ర్యాంపువాక్ ఆహుతులను ఎంతగానో అలరించాయి. విద్యార్థుల హుషారైన గీతాలకు, నృత్యాలకు విద్యార్థులు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. కార్యక్రమంలో డీన్‌లు డాక్టర్ జిఆర్‌కె.శాస్త్రి, డాక్టర్ జిబి.వీరేష్‌కుమార్, డాక్టర్ ఎన్.జయరామ్, డాక్టర్ టి.కురుమయ్య, ఆచార్యులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ తలారి రేష్మా, డాక్టర్ హిమబిందు, డాక్టర్ రాజేశ్వరరెడ్డి, డాక్టర్ రాముడు పాల్గొన్నారు.










