ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
అల్లూరి సీతారామరాజు పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపునిచ్చారు. అల్లూరి 125వ జయంతి పురస్కరించుకుని చిత్తూరు కార్యాలయంలో జిల్లాస్థాయి విస్తృత సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ హిందూ మతం పేరుతో దేశంలోని హిందూ, ముస్లీమ్, క్రిష్టియన్‌ల మధ్య మతచిచ్చు రేపుతున్న బిజేపి తాజాగా మన్యం వీరుడు అల్లూరి జయంతి ఉత్సవాల పేరుతో భారీ విగ్రహం పెట్టి కపట ప్రేమ ప్రదర్శిస్తోందన్నారు. ఎర్రజెండా బిడ్డలుగా యువజన, విద్యార్థి సంఘాలు భగత్ సింగ్, అల్లూరి స్పూర్తితో సమస్యలపై పోరాటాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నాటి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి జయంతి ఉత్సవాలు జరుపుతున్న బిజేపి నాయకులు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేయడం విడ్దురంగా లేదా అని ప్రశ్నించారు. జనం కోసం సిపిఎం, ఇంటింటికీ సిపిఎం పేరుతో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయేందుకు ఈనెల 11వ తేది సోమవారం కలెక్టర్‌తో రాయబారం పేరుతో జిల్లా వ్యాప్తంగా సిపిఎం గుర్తించిన సమస్యలను కలెక్టట్ దృష్టికి తీసుకుపోనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సీపిఎం సీనియర్ నాయకులు చల్లా వెంకటయ్య, చైతన్య, నగర కార్యదర్శి సురేంద్రన్, గరిధరగుప్త, చిరంజీవమ్మ, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
మన్యం విప్లవ వీరుడికి నివాళి : జేసీ
బ్రిటీషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్‌లో అల్లూరి చిత్ర పటానికి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర చరిత్ర లో అల్లూరి సీతారామరాజు ఒక మహౌజ్వల శక్తి అని, ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడని కీర్తించారు. అల్లూరి సాయుధ పోరాటం కీర్తించదగినదని పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి జగదీష్ అన్నారు.










