Oct 29,2023 21:24

బెజ్జిపుట్టుగలో పులి అడుగులు గుర్తిస్తున్న అటవీ సిబ్బంది

* పలు గ్రామాల్లో పెద్దపులి అడుగులు
* భయాందోళనలో ఉద్దానం ప్రజానీకం
ప్రజాశక్తి - కవిటి: 
పచ్చని ప్రకృతి అందాలతో, ప్రశాంతంగా ఉండే ఉద్దానం ప్రాంతం... పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో అలజడి రేగుతోంది. కంచిలి మండలంలోని మండపల్లి, అమ్మగారిపుట్టుగ, బంజరి నారాయణపురం తదితర గ్రామాల్లో శనివారం పెద్దపులి అడుగులు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం కవిటి మండలం బెజ్జిపుట్టుగ, జగతి, కవిటి, పుక్కళ్లపాలెం తదితర గ్రామాల్లో గుర్తించారు. పుళ్ళల్లపాలెం తీరంలోని రంగాల గెడ్డలో నీరు తాగిన పెద్దపులి తీరంలోని దట్టమైన ముళ్లపొదల్లో ఉన్నట్లు అటవీ సిబ్బంది అనుమానిస్తున్నారు. దీంతో ఉద్యాన ప్రాంతమైన కవిటి మండలంలో పెద్దపులి సంచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు, కూలీలు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మూడు రోజులుగా అలజడి రేపుతున్న పెద్దపులి ఇంతవరకు ఎక్కడా, ఎవరికీ కనిపించకపోవడం, పులి ద్వారా ఇప్పటివరకు ఎటువంటి హాని లేకపోవడంతో ఇప్పటివరకు ఊరటగా అనిపిస్తోంది. పెద్దపులి సంచారం నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్‌ శాఖలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం చేరవేస్తూ గ్రామాల్లో దండోరా వేయించారు. అటవీశాఖ ఎఫ్‌ఎస్‌ఒ రాఘవయ్య, రాజు, రెడ్డి, ఎఫ్‌డిఒ సంతోష్‌ కుమార్‌, ఎ.రవి మత్స్యకార గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ నిరంతరం పెద్దపులి కదలికలపై నిఘా వేసి ఉంచారు. మరోవైపు ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో కొందరు ఆకతాయిలు ఫొటో మార్ఫింగ్‌లతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ స్థానికులను హడలెత్తిస్తున్నారు. శనివారం సాయంత్రం కొబ్బరి తోటల్లో పులి తిరుగుతున్నట్లు, రాత్రి తొమ్మిది గంటల తర్వాత బల్లిపుట్టుగ, బొరివంక గ్రామాల్లో రోడ్డు దాటుతున్నట్లు ఫొటోలు మార్ఫింగ్‌ చేసి పోస్టులు చేస్తూ మరింత భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే తప్పుడు పోస్టులు పెట్టవద్దని అధికారులు చెప్పారు.