Nov 04,2022 22:57

శేషాచలం అటవీ ప్రాంతంలో

అలిపిరి ఘటనలో 'ఆంతర్యం' ఏంటి..?
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

అలిపిరిలో యువకుల హల్‌చల్‌ ఎందుకు చేశారో అర్ధమయినా, అడవిలో మిస్సయిన ఆ ఇద్దరు యువకులకు సంబంధించిన సమాచారం మాత్రం తెలియలేదు. ఇప్పటికే రెండు రోజులయ్యింది. అక్టోపస్‌ దళాలతో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకూ శేషాచలం అటవీ ప్రాంతంలో గాలించారు. ఆ ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో అదుపులో ఉన్న ఆ ముగ్గురిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ప్రవల్లిక ఇచ్చే సమాచారం కీలకం కావడంతో ఆమెను అలిపిరి పోలీసులు పిలిపించారు. అయితే ఈ కేసు తమ పరిధి కాదని అలిపిరి పోలీసులు, తమ పరిధి కాదని రేణిగుంట పోలీసులు ఇప్పటికీ తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. గల్లంతయిన కార్తీక్‌, రాము దొరికారని, హైదరాబాద్‌ వెళ్లిపోయారని, తిరిగి రెండు రోజుల్లో వస్తారనీ చెబుతుండటంపైనా కేసుకు సంబంధించిన 'ఆంతర్యం' ఏమిటో అర్ధం కాని పరిస్థితి.
అసలేమయిందంటే ?
శ్రీవారి దర్శనార్ధం విచ్చేసే భక్తులతో అలిపిరి తనిఖీ కేంద్రం నిత్యం రద్దీగా ఉంటుంది.. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో కారు దిగిన యువకుడు తనను కిడ్నాప్‌ చేసారంటూ టిటిడి విజిలెన్స్‌ సిబ్బందిని ఆశ్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.. ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం, మరో ఇద్దరు వాహనంను టోల్‌ గేట్‌ లో ఆపకుండా ఘాట్‌ లోకి వెళ్ళి ఎస్కేప్‌ అయ్యేందుకు ప్రయత్నించారు.. దీంతో ఆ వాహనంను అలిపిరి టోల్‌ గేట్‌ సిబ్బంది మరో వాహనంలో వెంబడించి లింక్‌ రోడ్డు సమీపంలో అడ్డుకున్నారు.. వాహనంను విజిలెన్స్‌ సిబ్బంది అడ్డుకోవడంతో ఆ ఇద్దరు యువకులు పక్కనే ఉన్న లోయలోకి దిగారు.. ఆక్టోపస్‌ సిబ్బంది, పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బంది ఎంత వెతికినా ఆ ఇద్దరి ఆచూకీ మాత్రం లభించలేదు. అదుపులో ఉన్న ముగ్గురిని రేణిగుంట పొలీసులకు విజిలెన్స్‌ అధికారులు అప్పగించారు.
వివాహేతర సంబంధమే కారణమా..?
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాహుల్‌ చైతన్య, అదే ఊరికి చెందిన ప్రవల్లికను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది రోజుల వరకూ అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు.. వత్తిరీత్యా రాహుల్‌ చైతన్య తిరుపతి జిల్లా, రేణిగుంటలోని గౌరినగర్‌లో నివాసం ఉంటున్నాడు. రాహుల్‌ చైతన్య ,ప్రవల్లిక కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్ది చెప్పడంతో ప్రవల్లికను రేణిగుంటలో కాపురం పెట్టేందుకు ఒప్పుకున్నాడు.. అప్పటి నుండి ప్రవల్లిక తన భర్త రాహుల్‌ చైతన్యతో ఫోన్లో సంభాషిస్తూ వచ్చేది.. ఈక్రమంలో వారం క్రితం రాహుల్‌ చైతన్య పుట్టిన రోజు రావడంతో ప్రవల్లిక తన భర్తకు సర్ప్రైజ్‌ చేసేందుకు రేణిగుంటకు వచ్చింది. సర్‌ప్రైజ్‌ చేద్దామని వచ్చి వేరే మహిళతో భర్త సన్నిహితంగా ఉండటం చూసిన ప్రవల్లిక మనోవేదనతో తిరిగి రాజమండ్రికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ప్రవల్లిక అన్న గణేష్‌ తాను స్నేహితులతో కలిసి తిరుమలకు వెళుతున్నానని చెప్పి రాహుల్‌తో మాట్లాడతానని చెప్పి ఓదార్చాడు. తిరుమల యాత్రకు స్నేహితులతో కలిసి బయల్దేరిన ప్రవల్లిక అన్న రేణిగుంటకు చేరుకుని తిరుమలకు వెళుతున్నానని, తనతో రావాలని కోరాడు. రాహుల్‌ చైతన్యను కారు ఎక్కించుకుని వెళుతూ తన చెల్లి రేణిగుంటకు వచ్చిన సమయంలో మరో మహిళతో ఉన్న విషయమై ప్రస్తావించాడు. దీంతో తనను ఎక్కడ కొడతారోనని భయపడిన రాహుల్‌ చైతన్య అలిపిరి టోల్‌గేట్‌ చేరుకోవడంతో కారు దిగి తనను కిడ్నాప్‌ చేశారంటూ గట్టిగట్టిగా కేకలు వేస్తూ అక్కడే ఉన్న టిటిడి విజిలెన్స్‌ సిబ్బందిని ఆశ్రయించడంతో సీన్‌ ప్రారంభమయ్యింది. రాహుల్‌ చైతన్యను పట్టుకునేందుకు వచ్చిన లోకేష్‌, గణేష్‌, రాజేష్‌లను టిటిడి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనిని గమనించిన కారు డ్రైవర్‌ వెంటనే కారును టోల్‌గేటులో ఆపకుండా రెండో ఘాట్‌రోడ్డులోకి పోనిచ్చాడు. మరో వ్యక్తి కూడా టోల్‌గేటు దాటి వాహనాన్ని ఎక్కి ఘాట్‌రోడ్డులో వేగంగా పోనిచ్చారు. అయితే వాహనాన్ని వెంబడించిన టిటిడి విజిలెన్స్‌ పోలీసులు రెండో ఘాట్‌రోడ్డులోని లింక్‌ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. అయితే తమను ఎక్కడ అరెస్టు చేస్తారోనని భయపడిన ఆ ఇద్దరు యువకులు కార్తీక్‌, రాము పక్కనే ఉన్న లోయలో దిగి పరారయ్యారు. ఈ కారు కలకలం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.