అప్సడా వైస్ ఛైర్మన్ వడ్డీ రఘురాం
ప్రజాశక్తి - ఉండి
ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని అప్సడా వైస్ ఛైర్మన్ వడ్డీ రఘురాం అన్నారు. మంగళవారం వాండ్రం గ్రామంలోని ఫిష్ ట్రేడర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వడ్డీ రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతు గాదిరాజు సుబ్బరాజు మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా కెపాసిటీ లక్ష టన్నులైతే సగటున ఉత్పత్తి లక్షా 50 వేల టన్నులు జరుగుతోందని, దీనివల్ల 50 వేల టన్నుల సరుకు మిగిలిపోయి రేటు తగ్గుముఖం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాల్వ నీటితో ఆక్వా సాగు చేసే అవకాశం గోదావరి జిల్లాలో లేదని, బోర్ వాటర్‌తో ఆక్వా సాగు బాగుంటుందని అయితే బోర్లు తవ్వుతుంటే కలెక్టర్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని దీంతో అధికారులు బోర్‌ను అడ్డుకుంటున్నారని రైతులు అప్సడా వైస్ ఛైర్మన్ దృష్టికి తెచ్చారు. కోనసీమ ఆక్వా రైతు సంఘం నాయకులు నాగభూషణం మాట్లాడుతూ రైతుల్లో ఐకమత్యం లేకపోవడం వల్లే ఆక్వా రైతులకు దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బోర్ వేసేటప్పుడు సరిహద్దు రైతు ఫిర్యాదు చేస్తే బాగుంటుందని కానీ సుదూర ప్రాంతంలో ఉండే వ్యక్తులు కూడా స్పందనలో ఫిర్యాదు చేస్తున్నారని, వాటిని అధికారులు స్వీకరించడం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆక్వా రైతు జికెఎఫ్ సుబ్బరాజు మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటి నాటికి పది ఎకరాల్లోపు రైతులకు విద్యుత్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని దానికి కారణం అప్సడా వైస్ ఛైర్మన్ వడ్డీ రఘురాం అన్నారు. అనంతరం అప్సడా వైస్ ఛైర్మన్ వడ్డీ రఘురాం మాట్లాడుతూ ఆక్వా రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. పదెకరాల పైబడి సుమారు 93 వేల ఎకరాలు సాగు చేస్తున్నారని వీరికి కూడా విద్యుత్ సబ్సిడీ ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సీడ్ క్వాలిటీ, ఫీడ్ ధరల నియంత్రణ లేకపోతే కంపెనీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆక్వా రైతులకు మెరుగైన సేవలందిస్తున్న భీమవరం ఎఫ్‌డిఒ లావణ్య, శృంగవృక్షం గ్రామ ఫిషరీస్ అసిస్టెంట్ లక్ష్మీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










