Dec 14,2022 21:38

పాతటైర్లలో మొక్కలు నాటుతున్న కమిషనర్‌

ఆకట్టుకుంటున్న.. రంగుల చక్రాలు..
పాతటైర్లతో కళాఖండం
మొక్కలు నాటిన కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:

వృధాగా పడి ఉన్న పాత టైర్లతో తయారుచేసిన రంగు చక్రాల కళాఖండం ఆకట్టుకుంటోంది. నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ఆలోచనలకు అనుగుణంగా నగరపాలక సంస్థ వాహనాల షెడ్డులో గత కొన్నేళ్లుగా వధాగా పడిఉన్న పాతటైర్లతో ఈ కళాఖండాన్ని తయారు చేశారు. కట్టమంచి చెరువు వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన ఈ రంగుల చక్రాల్లో బుధవారం ఉదయం నగర కమిషనర్‌ పూలమొక్కలు నాటారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. పర్యావరణానికి హానికరమైన వ్యర్ధాలను నిరుపయోగంగా పడేయకుండా తిరిగి వినియోగంలోకి తేవడంలో భాగంగా పాతటైర్లకు రంగులు వేసి ఒక చక్రాల గోడలా తయారు చేశామని చాలా అందంగా వచ్చిందని వివరించారు. వీటిలో పూలమొక్కలు నాటి మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తామన్నారు. పర్యావరణానికి హానికరమైన వ్యర్ధాలను తిరిగి వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని చెప్పారు. వ్యర్ధాలతో మరిన్ని ఉపయోగకర పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈ రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య, నరసింహ, వెహికల్‌ షెడ్‌ ఇన్చార్జి కె.యోగ నరసింహులు, వెహికల్‌ షెడ్‌ సిబ్బంది పాల్గొన్నారు.