ఆకట్టుకుంటున్న డ్వాక్రా స్టాల్స్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
వినాయక నిమజ్జనం జరిగే కట్టమంచి చెరువు వద్ద ఏర్పాటు చేసిన డ్వాక్రా స్టాల్స్ ఆకట్టుకుంటోంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా కట్టమంచి చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనానికి నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్ల చేపట్టింది. నగర కమిషనర్ డాక్టర జె.అరుణ ఈ సంవత్సరం ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలతో ఏర్పాటు చేయించిన స్టాల్స్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఐదు రోజులపాటు నగర ప్రజలు నిమజ్జనం కోసం తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కోసం ప్రత్యేకంగా డ్వాక్రా ఉత్పత్తులతో కూడిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయించారు. బొమ్మల కొలువు, అల్లికలతో తయారుచేసిన బుట్టలు, అలంకరణ వస్తువులు, చిన్నపాటి గహోపకరణాలు, దుస్తులు తక్కువ ధరకే అందుబాటులో ఉంచారు. వీటితోపాటుగా చిరు, తణధాన్యాలతో తయారుచేసిన వంటకాలతో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఆహా పేరుతో ఏర్పాటు చేసిన క్యాంటీన్లో అల్పాహారాలను అందుబాటులో ఉంచారు. వినాయక చవితి పురస్కరించుకొని వినూత్న ఆలోచనతో కమిషనర్ ఏర్పాటు చేసిన డ్వాక్రా స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.










