Nov 07,2022 21:51

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

అక్టోబర్‌ విప్లవం ప్రపంచానికి దిక్సూచి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: 105 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం, ఒక శతాబ్దం క్రితం ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ ప్రపంచ చరిత్ర గతినే మార్చివేశాయి. నవంబర్‌ 7న ప్రారంభమైన అక్టోబర్‌ విప్లవం నూతన సమాజానికి నాంది పలికిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు. సోమవారం సిపిఎం కార్యాలయంలో అక్టోబర్‌ విప్లవంపై సమావేశం సురేంద్రన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ విప్లవం వలన సోవియట్‌ యూనియన్‌లో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అనారోగ్యం మొదలైనవి అతితక్కువ వ్యవధిలో నిర్మూలింప బడ్డాయని తెలిపారు. అదే సమయంలో సైన్స్‌ అభివృరద్ధి విషయంలో భారీ ప్రగతిని సాధించిందని, అంతేగాక అత్యంత సంపన్నమైన, అత్యంత అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశమైన అమెరికాతో పోటీ పడేలా సోవియట్‌ యూనియన్‌ ఎదిగిందని పేర్కొన్నారు. మత విభజన సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతత్వంలో పనిచేస్తున్న మోడీ ప్రభుత్వ హయాంలో మనం అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్నామన్నారు. అంతేగాక ఎంతో కష్టపడి సాధించుకున్న హక్కుల మీద, ప్రజల ప్రయోజనాలపైన దాడి జరుగు తున్నదన్నారు. బ్రిటిష్‌ పాలనను తలపించే పరిస్థితులకు ప్రజలు నెట్టివేయబడుతున్నారని పేర్కొన్నారు. అక్టోబర్‌ విప్లవాన్ని స్మరించుకోవడం, అది సాధించిన ఘనవిజయాలను గుర్తుచేసుకోవడం మొక్కుబడి కార్యక్రమంగా పరిగణించరాదన్నారు. సామాన్య ప్రజలు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక వర్గాల ద్వారానే మన సమాజం సంపద సష్టించ బడిందని, శ్రమ దోపిడీ చేసే పెట్టుబడిదారీ వ్యవస్థ వలన ఇబ్బంది పడుతున్న వీరంతా ఉమ్మడి పోరాటాల ద్వారానే ఈ విధానాలను తిప్పికొట్టి ప్రత్యామ్నాయ విధానాలను తీసుకు రాగలరని తెలిపారు. వ్యవస్థాగత సంక్షోభంలో ఉన్న దోపిడీ పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చాల్సిన అవసరం గురించి కార్మికులు, కర్షకులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కర్తవ్య సాధనకు ఐక్య పోరాటాలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా అక్టోబర్‌ మహా విప్లవం స్ఫూర్తితో కార్మిక వర్గాన్ని సిద్ధం చేయాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి పి.చైతన్య, సీనియర్‌ నాయకులు చల్లా వెంకటయ్య పాల్గొన్నారు.