ప్రజాశక్తి వార్తకు స్పందన
ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ సిబ్బంది
ప్రజాశక్తి- యాదమరి:
యాదమరి మండలం తెల్లరాళ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుమ్మడికాయ చెరువులో ఆక్రమణలు అనే శీర్షిక ప్రజాశక్తి దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితమైనది. దీనిపై స్పందించిన తహశీల్దార్ వై.చిట్టిబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలు తొలగించారు. చెరువు ఆయకట్టు పరిధిలో కొంతమంది అక్రమార్కులు బండరాళ్లు మట్టి తోలి చెరువులో దారివేసుకోవడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు జెసిబి సాయంతో వాటిని పూర్తిగా తొలగించారు. చెరువులు ఆక్రమించుకున్న వ్యక్తులపై రెవెన్యూ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇరిగేషన్‌శాఖ అధికారి కిషోర్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా చెరువును పూర్తిస్థాయిలో సర్వేచేసి చెరువు చుట్టూ ఆక్రమణలను తొలగిస్తామని తహశీల్దార్ తెలిపారు.










