May 01,2023 21:58

సెల్ఫీ ఛాలెంజ్‌ విసురుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

            ప్రజాశక్తి-రాయదుర్గం   విప్‌ కాపు రామచంద్రారెడ్డి అసమర్థత, చేతకానితనం వల్లే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాలేదని మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిపై మూడో వీడియోను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన రాయదుర్గం ప్రాంతంలో పేదలు అధికంగా ఉన్నారన్నారు. ఈప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవల కోసం తాను టిడిపి ప్రభుత్వంలో ఆస్పత్రి సామర్థ్యాన్ని 30 నుంచి 100 పడకలకు పెంచామన్నారు. అప్పట్లోనే సుమారు రూ.17కోట్లు నాబార్డు ద్వారా నిధులు మంజూరు చేయించామన్నారు. తర్వాత విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆస్పత్రిపై శ్రద్ధ చూపక పోవడంతో అదనపు భవన నిర్మాణం నత్తనడకన సాగుతోందని దుయ్యబట్టారు. వందపడకలతో సకల సౌకర్యాల నడుమ 18మంది వైద్య బందం సేవాలందించాల్సిన ప్రభుత్వాసుపత్రి పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచిందన్నారు. 2019 ఫిబ్రవరిలో వందపడకల ఆస్పత్రికి తాము భూమి పూజ చేయగా వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక విప్‌ కాపు రామచంద్రారెడ్డి రెండోసారి శంకుస్థాపన చేయించారని ఎద్దేవాచేశారు. అప్పట్లో తానే తెచ్చానని హడావిడి చేసిన ఎమ్మెల్యే నాలుగేళ్లు గడుస్తున్నా పనులను ఎందుకు పూర్తి చేయించలేదని సూటిగా ప్రశ్నించారు. అలాగే నియోజకవర్గంలో వైద్యరంగంలో ఎమ్మెల్యే 'కాపు' సాధించిన అభివృద్ధి శూన్యమన్నారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో రూ.3.60కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రికి కొత్త భవనాన్ని సమకూర్చానని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులను కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఎమ్మెల్యే ''కాపు'' అని విమర్శించారు. ఎమ్మెల్యే 'కాపు'నకు అక్రమార్జనపై ఉన్న శ్రద్ద అభివద్ధి పనులపై లేకపోవడంతోనే రాయదుర్గానికి ఈ దుర్గతి దాపురించిందన్నారు.