
* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి - ఆమదాలవలస: ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ విమర్శించారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద పొందూరు మండల టిడిపి నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జీలు నేను సైతం బాబు కోసం 26వ రోజు రిలే నిరాహార దీక్షలో గురువారం పాల్గొన్నారు. టిడిపి పొందూరు మండల అధ్యక్షుడు చిగురుపల్లి రామ్మోహన్‌కు రవికుమార్ నిమ్మరసం ఇచ్చి గురువారం దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందన్నారు. కక్షసాధింపు పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో చట్టాలకు వ్యతిరేకంగా రివర్స్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. ఉద్యోగుల జిపిఎఫ్ రూ.30 వేల కోట్లు మహిళా సంఘాల సభ్యుల అభయహస్తం పథకం కింద దాచుకున్న రూ.నాలుగు వేల కోట్లను దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. ఇసుక, మద్యం ఇలా అన్ని రంగాల్లో దోచుకోవడమే జగన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు. నాడు-నేడు పనుల్లో అవినీతి పెచ్చుమీరిందన్నారు. పాత భవనాలకు రంగులు వేసి బిల్లులు చేసుకుని అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పొందూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పాలిశెట్టి వెంకటరావును స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి పిలిపించి రూ.12 లక్షల చెక్కులపై సంతకాలు చేయించుకుని తీసుకున్నారని తెలిపారు. నాడు-నేడు పనులకు తమ్మినేని సీతారాంకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే క్షమించేది లేదని ఒకపక్క తమ్మినేని సీతారాం చెప్తారని, మరోవైపు ఆ పార్టీ నాయకులే ఎరుకులపేట, దల్లవలస, వి.ఆర్ గూడెం ఇలా ప్రతి గ్రామంలో భూములను ఆక్రమించి అనధికార కట్టడాలు చేపడుతున్న విషయం తమ్మినేనికి తెలియదా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపకపోతే భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్, టిడిపి నాయకులు బలగ శంకర భాస్కర్, అనకాపల్లి శ్రీరంగ, గాడు నారాయణరావు, అన్నెపు రాము, బాడాన శేషగిరి, మొదలవలస రమేష్, తమ్మినేని గీత, తమ్మినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.