Mar 01,2022 20:23

అనధికారికంగా వేసిన లేఔట్‌


 


రిజిస్ట్రేషన్లు నిలిపేయాలని ఆదేశాలు
30 అడుగుల రహదారి ఉండాలని ఆదేశం
10శాతం స్థలం స్థానిక సంస్థలకు అప్పగింత


ముందుగానే అనుమతులు తీసుకోవాల్సి ఉండగా ఆ విషయాన్ని రియల్టర్లు విస్మరిస్తున్నారు. దీంతోపాటు స్థానిక సంస్థల ఆదాయానికీ భారీగా గండి పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం లేఅవుట్లు లేకుండా ఎటువంటి స్థలాలకూ రిజిస్ట్రేషన్‌ చేయవద్దంటూ గత వారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్రమ లేఅవుట్లు వేసే స్థిరాస్థి వ్యాపారులకు చెక్‌ పెట్టినట్లయింది. మరోవైపు ప్రభుత్వనికీ ఆదాయం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడం వల్ల నిధుల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామాలు, పట్టణాలు, నగర ప్రాంతాలు అనధికార లేఅవుట్‌లకు అడ్డాగా మారుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్‌లు వేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లును ప్రభుత్వం నిలిపివేసింది. ఈమేరకు జిల్లా రిజిస్ట్రార్లకు రాష్ట్రస్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి ఉత్తర్వులు జారీఅయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నోటీసు బోర్డులలో పెట్టనున్నారు. జిల్లా రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తరించడంతో పాటు అక్రమ లేఅవుట్లు పెరిగాయి. కొందరు స్థిరాస్థి వ్యాపారులు ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ లేఅవుట్లు వేస్తున్నారు. లేఅవుట్లు అనుమతులు పొందాలంటే 30 అడుగుల రహదారిపాటు 10శాతం ఖాళీస్థలాన్ని స్థానిక సంస్థలకు అప్పగించాలి.కాని 10శాతం ఖాళీస్థలం ఇవ్వకుండానే లేఅవుట్‌లు వేస్తున్నారు. దీనితో కోట్లాది రూపాయిలు నష్టం వాటిల్లుతుంది. పార్కు, కమ్యూనిటి హాల్‌ నిర్మాణానికి ఖాళీస్థలాలు విడచిపెట్టుకున్నా లేఅవుట్‌లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. లేఅవుట్‌కు రిజిస్ట్రేషన్‌ విలువ 14శాతం సొమ్ము వసూలు చేస్తే కోట్ల రూపాయిలు ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు.
ఎప్పటిలాగే బెటర్‌మెంట్‌ చార్జీలు
బెటర్‌మెంట్‌ ఛార్జీలు ఎప్పటిలాగే వసూళ్లు చేస్తారు. నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా కొంత మంది రియల్టర్లు ఇష్టానుసారంగా వ్యవసాయ భూములను ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారు. లేఅవుట్‌లేని స్థలాన్ని కొనుగోలు చేసిన గృహనిర్మాణ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. లేఅవుట్‌ ఉంటే ఇంటి నిర్మాణ ప్లాన్‌కు అప్రూవల్‌ ఇస్తారు. ఫలితంగా అనధికారంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లలో స్థలాలకు సర్వేనెంబర్లు దస్తావేజుల ఆధారంగా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆస్థలానికి సంబందించిన లేఅవుట్‌ అనుమతి(ఎల్‌పి) ఉందా,లేదా అన్నది కూడా పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమ లేఅవుట్లు పుట్టగోడుగుల్లా పెరిగిపోయాయి. లేఅవుట్‌కు అనుమతులు లేకపోతే అక్రమకట్టడాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది. అక్రమ లేఔట్లకు చెక్‌పెడితే ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.