ప్రజాశక్తి-పుట్లూరు పుట్లూరు మండలంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడి వడగండ్ల వాన కురిసింది. మండలంలోని పుట్లూరు, బాలాపురం, పి.చింతలపల్లి, కోమటికుంట్ల, నారాయణరెడ్డి పల్లి, మడ్డిపల్లి తదితర గ్రామాల్లో గాలివానకు అరటిచెట్లు నేలకొరిగాయి. చీని, దానిమ్మ తోట రైతులకు కూడా నష్టం వాటిల్లింది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. మడ్డిపల్లిలో చెట్టు కొమ్మలు విరిగి ట్రాక్టర్ మీద పడడంతో పాక్షికంగా దెబ్బతింది. అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
శింగనమల : మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గోవిందరాయునిపేట గ్రామానికి చెందిన రైతు శంకర్‌రెడ్డికి చెందిన ఎనిమిది ఎకరాల్లోని మామిడి, నేరేడు పంటకు నష్టం వాటిల్లింది.
నార్పల : మండలంలో శనివారం కురిసిన అకాల వర్షానికి వందల ఎకరాల్లో అరటి, నారింజ, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. వెంకటాంపల్లి గ్రామంలో రైతు మాధవీలతకు చెందిన నారింజ పంట నేలపాలు అయింది. నరసాపురం గ్రామానికి చెందిన రైతు ఓబులేసుకు చెందిన మామిడి తోటలోని కాయలు నేలరాలాయి. మామిడి చెట్లు కూడా నేలకొరిగాయి. చాములూరు గ్రామంలో టమోటా, మొక్కజొన్న, మిరప పంటలకు నష్టంవాటిల్లింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. వ్యవసాయ అధికారి ముస్తఫా, ఉద్యాన అధికారి ఫజులున్నీషా మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలియజేశారు.
బుక్కరాయసముద్రం : మండలంలో శనివారం కురిసిన అకాల వర్షాలకు వందలాది ఎకరాల్లో అరటి, మొక్కజొన్న, నారింజ, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కొర్రపాడు, చదుళ్ల గ్రామంలో చేతికొచ్చిన అరటి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలవాలిపోయాయి. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. మండల వ్యవసాయ అధికారి శ్యామసుందర్‌రెడ్డి, ఉద్యాన అధికారి శైలజ మండలంలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్ట నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలియజేశారు.
బొమ్మనహాల్ : మండలంలోని గోవిందవాడ, దర్గాహోన్నూర్, బల్లలగుడం, కళ్లుహోళ, కళ్లు దేవనహళ్లి, బండూరు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను రాయదుర్గం వ్యవసాయ ఎడి లక్ష్మీనాయక్, ఉద్యానవన అధికారి దస్తగిరి శనివారం పరిశీలించారు. ఇందులో భాగంగా ధ్వంసమైన పంటలతోపాటు తడిసిన మిరప పంటను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట తడిసి నష్టపోయిన రైతులు తమ పరిధిలోని ఆర్‌బికెల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బికె సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద అనంతపురం-తాడిపత్రి జాతీయ రహదారిపై రోడ్డుపై పడిన వడగండ్లు










