May 16,2023 22:12

నార్పల మండలంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

       శింగనమల : అనంతపురం జిల్లాలో వడగండ్లు, అకాల వర్షాలతో పంటదెబ్బతిన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా పరిధిలోని శింగనమల, నార్పల మండలాల్లో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా అకాల వర్షాలతో రైతులు పెద్ద ఎత్తున పంటను నష్టపోయారన్నారు. చేతికొచ్చిన వేరుశనగ, వరి, మిరప, టమోటా, అరటి తదితర పంటలు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన పడ్డారన్నారు. పంట నష్టంపై ఇప్పటి వరకు జాబితా కూడా సిద్ధం చేయని పరిస్థితి నెలకొందన్నారు. అందరినీ ఆదుకుంటామని బటన్‌ నొక్కే ముఖ్యమంత్రి రైతులు పంటలు నష్టపోతుంటే వారికోసం బటన్‌ ఎందుకు నొక్కరని ప్రశ్నించారు. బాధిత రైతులకు వెంటనే పంట నష్టపరిహారం అందించేలా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతుల కోసం ఈ నెల 22న సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించి, ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ నాయకులు పి.నారాయణస్వామి, డి.చిన్నప్పయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.