Jul 03,2022 22:29

జీవో 117 రద్దు కోసం పోరాటానికి సిద్ధమంటున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు

జీవో 117తో ప్రాథమిక విద్యా వ్యవస్థ నాశనం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:నూతన విద్యావిధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం జీవో 117 తీసుకురావడం వల్ల ప్రాధమిక విద్యావ్యవస్థ నిర్వీయం అవుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను రద్దుచేసి ప్రాథమిక విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ కార్యచరణను రూపొందిస్తున్నాయి. న్యాయపమైన పోరాటంతో పాటు మీఊర్లో బడి మాయమౌతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పూర్వవిద్యార్థులు, విద్యార్థులను కలుపుకొని ప్రజాపోరాటానికి సిద్ధం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలకు సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వం అనాలోచితంగా విద్యావేత్తలు, ఎంఎల్‌సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకోకుండా గత నెల 10వ తేదీ జీవో 117 తీసుకొచ్చిందని ఉపాధ్యాయుల పునర్వభజన జరిగితే ఇవే ఉత్తర్వులు మున్సిపల్‌ పాఠశాలకు కూడా వర్తింపజేసి మొత్తం ప్రభుత్వ పాఠశాలల విద్య సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ, కార్పొరేట్‌ విద్యకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వ విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే
- జివి. రమణ, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి

నూతన విద్యావిధానం పేరుతో తీసుకొచ్చి జీవో 117 ఫలితంగా ప్రాథమిక విద్య చిన్నాభిన్నం కావడంతో పాటు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. 3,45 తరగతులు విలీనం, 1,2 తరగతులు అంగన్వాడీల్లో కలిపేస్తే ఇక ప్రాథమిక పాఠశాలలు ఎక్కడ ఉంటాయి. ఇది అత్యంత దుర్మార్గం విలీన ప్రక్రియ వెంటనే ఆపాలి. 3 నుంచి 8 తరగతులకు ఆరుగురు ఉపాధ్యాయులను నియమించడం వల్ల ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తఉద్యమం
- గంటా మోహన్‌, ఎస్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు

ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో117ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఐక్యకార్యచరణ ద్వారా ఎదుర్కొంటాం. ప్రభుత్వ బడులు ప్రాధాన్యత, ఆవస్యకత ప్రజలకు తెలియజేస్తాం. యువజన, విద్యార్థి, ప్రజాసంఘాలను కలుపుకొని జీవోకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తాం. ప్రభుత్వం నాణ్యమైన విద్య, నాడు- నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేస్తున్నట్లు చెబుతూనే ప్రభుత్వ బడులను నాశనం చేసేలా జీవో తీసుకురావడం దారుణం.
జీవో 117 రద్దు కోసం తుది వరకు పోరాడుతాం
- గోపినాథ్‌, ఎపిటిఎఫ్‌ 257 జిల్లా అధ్యక్షులు

ప్రభుత్వబడులు, ఉపాధ్యాయుల ఉనికిని ప్రశ్నంచేలా ఉన్న జీవో 117 రద్దు కోసం తుది వరకు పోరాటం చేసేందుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలను ఐక్యం చేసి ఉద్యమ కార్యచరణ రూపొందించడం జరిగింది. మండలస్థాయి నుండీ రాష్ట్ర స్థాయి వరకు పోరాట కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. కలిసి వచ్చే శక్తులను కలుపుకొని జీవో 117 రద్దుకోసం ఉద్యమాన్ని కొనసాగిస్తాం. జీవో117 ప్రమాదాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల కమిటిలకు వివరిస్తాం.
మోసపూరిత నూతన విద్యావిధానం
- రఘుపతిరెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

నూతన విద్యావిధానం అత్యంత మోసపూరితమైంది. తరగతుల విలీనంతో ప్రాథమిక విద్య ప్రమాదంలో పడనుంది. ఉపాధ్యాయుల సర్దుబాటు ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే అన్ని జిలాల్లో ఉపాధ్యాయ సంఘాలు జీవో 117 రద్దు కోసం పోరాట కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో జేఏసిలు ఏర్పాటు అవుతున్నాయి. అన్ని ఉపాధ్యాయసంఘాలు జీవోకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. జీవోలోని నిబంధనలు అమల్లోకి వస్తే పాఠశాల విద్య సంక్షోభంలోకి నెట్టబడుతుంది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న జీవో 117రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించేంత వరకు రాజీలేని పోరాటాలకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధం అవుతున్నాయి.