Jul 16,2023 21:07

బ్యాంకు ఓబులేసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

            ప్రజాశక్తి-తాడిపత్రి   కార్మికులంతా ఐకమత్యంగా పోరాటాలు చేసి హక్కులు సాధించుకుందామని ఎపి మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయంలో తాడిపత్రి మున్సిపల్‌ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. కార్మికులకు సేఫ్టీ పనిముట్లు లేక విధులు నిర్వహిస్తూ మృతి చెందారన్నారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అన్నారు. జీవితాంతం పనిచేసిన పెన్షన్‌ ఉండడలేదని, కోవిడ్‌ సమయంలో మృతిచెందిన కార్మికులకు బీమా వర్తింపజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రశ్నించే విధానాన్ని చంపేసిన మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి ప్రభాకర్‌ రెడ్డి నేడు ప్రశ్నించమని చెప్పడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. ఇంజినీరింగ్‌ వర్కర్స్‌కి రిస్క్‌ అలవెన్స్‌ అమలు చేయాలని, జీవో నెంబర్‌ 7 ప్రకారం స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ వేతనాలివ్వాలని, 0 1 0 పద్దు కింద వేతనాలు ఇవ్వాలి, 60 సంవత్సరాలు పైబడిన వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అనేక మున్సిపాలిటీల్లో మృతిచెందిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీలోనే 11 మంది కార్మికులు చనిపోతే పటించుకోలేదన్నారు. వెంటనే ఆయా కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేపడితే కానీ కార్మికులకు పనిముట్లు ఇవ్వని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కార్యకర్తలను పోలీసులు కొడితే ఆయా పార్టీల నాయకులు ఆయా ప్రాంతాలకు వెళ్లి పరామర్శిస్తున్నారు. అదే కార్మికుల అనేకమార్లు సమస్యలపై రోడ్లెక్కి పోలీసుల దెబ్బలు తింటుంటే ఏ నాయకుడూ పరామర్శించిన పాపానపోలేదన్నారు. జరుగుతున్న పరిస్థితుల్లో దృష్ట్యా ఏ కార్మికునికి కష్టం వచ్చినా అందరం ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, సిఐటియు నాయకులు జగన్మోహన్‌ రెడ్డి, ఉమా గౌడ్‌, అంజి తదితరులు పాల్గొన్నారు.