ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే తాము ఎలా బతకాలని గార్బేజీ కార్మికులు నిలదీశారు. బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో గార్బేజ్ కోవిడ్, మలేరియా, కార్మికులు నగరంలోని కమిషనర్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎటిఎం నాగరాజు మాట్లాడుతూ గార్బేజ్ కార్మికులకు ఐదు నెలలుగా బకాయి ఉన్న జీతాలు, మలేరియా కార్మికులకు మూడు నెలలుగా బకాయి ఉన్న జీతాలు, కోవిడ్ కార్మికులకు రెండు నెలలుగా బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఉన్నతాధికారులు కార్మికుల సమస్యలు పట్టించుకోకపోగా మభ్య పెట్టే విధంగా మాట్లాడటం తగదన్నారు. తమ ప్రాణాల సైతం లెక్కజేయకుండా అనంతపురం మురికినంత శుభ్రం చేస్తూ, మలమూ త్రాలు ఎత్తేస్తూ, మోరీల కింద దూరి పూడిక తీస్తూ పరిశుభ్రతకు పాటుపడుతున్నారన్నారు. అలాంటి కార్మికులకు ఐదు నెలలగా జీతాలు చెల్లించకుంటే ఎలా అని ప్రశ్నించారు. కార్మికులపై ఉన్నతాధికారులు మొండి వైఖరిగా వ్యవహరిస్తే మున్సిపల్ ఆఫీస్ ముందు టెంటు వేసుకుని కూర్చుంటామని హెచ్చరించారు. ఇందుకు స్పందించిన కమిషనర్ వీలైనంత త్వరగా కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. తర్వాత కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉన్నతాధికారులతో, ఎగ్జామినర్‌తో మాట్లాడి శుక్రవారం వేతనాలను కార్మికుల ఖాతాలకు జమ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి తిరుమలేశు, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, కమిటీ సభ్యులు ఆదినారాయణ, నాగేంద్ర, చలపతి, కుళ్లాయప్ప, రాఘవేంద్ర, వీరికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఎం.నల్లప్ప, రాజు, కార్మికులు పాల్గొన్నారు.
కమిషనర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న కార్మికులు, నాయకులు










