Sep 21,2023 09:32

అసంపూర్తిగా హంద్రీనీవా కాలువ (ఫైల్‌ ఫొటో)

       అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటిగానున్న తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పరిధిలోకి వచ్చే రెండు ప్రధాన కెనాల్‌ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా అసంపూర్తిగానే ఆగిపోయి ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా గత కొంతకాలంగా పనులు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు చెల్లింపులు జరిగినా అన్‌సీజన్‌లో ప్రారంభించడానికి కాంట్రాక్టరు ముందుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మధ్యలోనే ఆధునీకరణ ఆగింది.
జిబిసి(గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌)
       హెచ్‌ఎల్‌ఎంసి నుంచి పాల్తూరు వద్ద గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌గా విడిపోయి ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తుంది. 59.40 కిలోమీటర్లు ఉండే ఈ కాలువ కింద 15,760 ఎకరాల ఆయకట్టు ఉంది. 2.77 టిఎంసిల నీటి కేటాయింపులున్నాయి. ఇది పూర్తిగా దెబ్బతిని ప్రవాహ సామర్థ్యం మేరకు నీటి ప్రవాహం వెళ్లే పరిస్థితుల్లేకపోవడంతో 2016వ సంవత్సరంలో ఈ కాలువ ఆధునీకరించాలని నిర్ణయించి టెండర్లు పిలిచారు. రూ.234.67 కోట్లతో చేపట్టిన ఆధునీకరణ పనులు రూ.188.69 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అయితే తక్కిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించలేదన్న ఉద్ధేశంతో మధ్యలోనే పనులను ఆపేశారు. ఈ బిల్లులు ఇటీవలి కాలంలో వచ్చాయి. తరువాత పనులకు కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశముందన్న ఉద్ధేశంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రావడం లేదు. అధికారులేమో ఇప్పుడు అన్‌సీజన్‌ కాబట్టి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు నోటీసులు అందించారు.
మిడ్‌పెన్నార్‌ దక్షిణ కాలువదీ అదే స్థితి
        మిడ్‌ పెన్నార్‌ నుంచి దక్షిణ కాలువ బయలుదేరుతుంది. ఇది కడప జిల్లా వరకు వెలుతుంది. సుమారు 44.44 కిలోమీటర్లు ఈ కాలువ వెలుతుంది. దీని కింద 22,708 ఎకరాల ఆయకట్టు ఉంది. 4.32 టిఎంసిల నీటి కేటాయింంపులున్నాయి. జిల్లాలో ఉన్న ప్రధాన కాలువల్లో ఇదీ ఒకటి. ఈ కాలువ ఆధునీకరణ కూడా రూ.509.16 కోట్లతో చేపట్టారు. మూడు ప్యాకేజీల్లో చేపిట్టిన ఈ పనులు ఇప్పటికి రూ.205.79 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న పనుల్లో ప్రధానంగా ఐదు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం జరగాల్సి ఉంది. కాని మధ్యలోనే ఆగిపోవడంతో డిస్ట్రిబ్యూటరీల నుంచి రైతులకు ఆయకట్టుకు నీరందడంలో సమస్య ఉంది. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పనులను కాంట్రాక్టరు ఆపారు. మిగిలిని పనులను పూర్తి చేయలేనని కాంట్రాక్టర్‌ అధికారులకు లేఖను అందజేశారు. అధికారులు ఇప్పటికీ దీనిపై ఎటుంటి చర్యలూ తీసుకోలేదు.
ఇంకా పూర్తవని బిటిపి భూసేకరణ
         భైరవానితిప్ప ప్రాజెక్టు భూసేకరణకు జులై నెలలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా వచ్చిన సందర్భంలో రూ.80 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ నిధులు ఇంకా పూర్తి స్థాయిలో నిర్వాసితులకు అందలేదు. మొత్తం రూ.155 కోట్లు నిధులు విడుదల చేశారు. ఇందులో రూ.55 కోట్లు పనులకు రూ.80 కోట్లు నిర్వాసితులకు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు చూస్తే 323 మంది రైతులకు రూ.29.6 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా 642 మంది రైతులకు సంబంధించి రూ.45.21 కోట్లు నిధులు సిఎఫ్‌ఎంఎస్‌లో పెట్టినప్పటికీ ఇంకా రైతాల ఖాతల్లో జమవ్వాల్సి ఉంది.
ఆధునీకరణ పూర్తి చేయాలి
చంద్రశేఖర్‌రెడ్డి ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.

        జిల్లాలో వర్షాపాతం తక్కువ కాబట్టి ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాలువల ఆధునీకరణ పూర్తి చేయాలి. జిల్లాలో ఏ ఒక్క సాగునీటి కాలువ కూడా సక్రమంగా లేదు. పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. అన్నీ కాలువలు కూడా పనులు ప్రారంభమై మధ్యలో ఆగి ఉన్నాయి. దీని వల్ల రైతులకు సక్రమంగా సాగునీరు అందటం లేదు. పైగా నీటి వృథా కూడా ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీటి కాలువల ఆధునీకరణ పూర్తి చేయాలి.