May 24,2023 22:00

తుంగభద్ర డ్యాం

       అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటిగానున్న తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పరిధిలోకి వచ్చే రెండు ప్రధాన కెనాల్‌ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా అసంపూర్తిగానే ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా గత కొంతకాలంగా పనులు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు చెల్లింపులు జరిగినా అన్‌సీజన్‌లో ప్రారంభించడానికి కాంట్రాక్టరు ముందుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మధ్యలోనే ఆధునీకరణ ఆగింది.
జిబిసి(గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌)
హెచ్‌ఎల్‌ఎంసి నుంచి పాల్తూరు వద్ద గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌గా విడిపోయి ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తుంది. 59.40 కిలోమీటర్లు ఉండే ఈ కాలువ కింద 15,760 ఎకరాల ఆయకట్టు ఉంది. 2.77 టిఎంసిల నీటి కేటాయింపులున్నాయి. ఇది పూర్తిగా దెబ్బతిని ప్రవాహ సామర్థ్యం మేరకు నీటి ప్రవాహం వెళ్లే పరిస్థితుల్లేకపోవడంతో 2016వ సంవత్సరంలో ఈ కాలువ ఆధునీకరించాలని నిర్ణయించి టెండర్లు పిలిచారు. రూ.234.67 కోట్లతో చేపట్టిన ఆధునీకరణ పనులు రూ.188.69 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అయితే తక్కిన పనులు మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదన్న ఉద్ధేశంతో మధ్యలోనే పనులను ఆపారు. ఈ బిల్లులు ఇటీవలి కాలంలో వచ్చాయి. తరువాత జరిగే పనులకు కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశముందన్న ఉద్ధేశంతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. అధికారులేమో ఇప్పుడు అన్‌సీజన్‌ కాబట్టి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు నోటీసులు అందించారు.
మిడ్‌పెన్నార్‌ దక్షిణ కాలువదీ అదే స్థితి
మిడ్‌ పెన్నార్‌ నుంచి దక్షిణ కాలువ బయలుదేరుతుంది. ఇది కడప జిల్లా వరకు వెలుతుంది. సుమారు 44.44 కిలోమీటర్లు ఈ కాలువ వెలుతుంది. దీని కింద 22,708 ఎకరాల ఆయకట్టు ఉంది. 4.32 టిఎంసిల నీటి కేటాయింంపులున్నాయి. జిల్లాలోనున్న ప్రధాన కాలువల్లో ఇదీ ఒకటి. ఈ కాలువ ఆధునీకరణ కూడా రూ.509.16 కోట్లతో చేపట్టారు. మూడు ప్యాకేజీల్లో చేపిట్టిన ఈ పనులు ఇప్పటికి రూ.205.79 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. పెండింగులోనున్న పనుల్లో ప్రధానంగా ఐదు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం జరగాల్సి ఉంది. కాని మధ్యలోనే ఆగిపోవడంతో డిస్ట్రిబ్యూటరీల నుంచి రైతులకు ఆయకట్టుకు నీరందడంలో సమస్య ఉంది. బిల్లులు పెండింగులో ఉన్నాయని పనులను ఆపి కాంట్రాక్టరు, పనులు పూర్తయినా ఇక తాను చేయలేనని చేతులెత్తేశాడు. క్లోజ్‌ చేయమని అధికారులకు లేఖను అందజేశారు. అధికారులు ఇప్పటికీ దీనిపై ఎటుంటి చర్యలు తీసుకోలేదు.
ఆధునీకరణ పూర్తి చేయాలి
చంద్రశేఖర్‌రెడ్డి, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.

జిల్లాలో వర్షాపాతం తక్కువ కాబట్టి ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనికి కాలువల ఆధునీకరణ పూర్తి చేయాలి. జిల్లాలో ఏ ఒక్క సాగునీటి కాలువ కూడా సక్రమంగా లేదు. పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. అన్నీ కాలువలు కూడా పనులు ప్రారంభమై మధ్యలో ఆగి ఉన్నాయి. దీని వలన రైతులకు సక్రమంగా సాగునీరు అందటం లేదు. పైగా నీటి వృథా కూడా ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీటి కాలువల ఆధునీకరణ పూర్తి చేయాలి.