
వంశధార శివారు భూములకు సాగునీరు ఇవ్వలేకపోయారు
వ్యవసాయ సలహా మండలి సమావేశంలో
అధికారులపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: వంశధార శివారు భూములకు సాగునీరు ఇవ్వకుండా ఐదేళ్లుగా ఏం చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులను ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశధార కాలువల ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌లో సాగునీరు అందించిన వివరాలను వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు వివరించిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి సమావేశంలో చెప్పిన మాటలనే చెప్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యలపై చివరి క్షణంలో చెప్తున్నారని, రూల్ ప్రకారం చేయమని చెప్తున్నా ఎవరూ చేయడం లేదన్నారు. వంశధారలో నీరున్నా ఇవ్వలేకపోయారని విమర్శించారు. వంశధార సాగునీటిపై వివరణల్లో ప్రగతి ఉందని, సాగునీరు మాత్రం ఇవ్వలేకపోయారని చెప్పారు. సాగునీరు ఇవ్వకుండా తప్పించుకోవడం సరికాదంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకుంటూ సాగునీటికి సంబంధించి కొన్ని అంశాలను నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. వంశధార కాలువల ఆధునీకరణ, గొట్టాబ్యారేజీ మరమ్మతులు, షట్టర్లు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు మాట్లాడుతూ వంశధార కాలువల పరిస్థితి బాగాలేదన్నారు. గత కుడి, ఎడమ కాలువల కోసం రూ.పది కోట్లు కావాలని ప్రభుత్వాన్ని రెండేళ్ల కిందటే అడిగామని, ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని వివరించారు. షట్టర్లూ బాగాలేవని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికీ తీసుకెళ్లామని చెప్పడంతో మంత్రి అప్పలరాజు చల్లబడ్డారు.
ఖరీఫ్‌లో పంటలు వేయలేకపోయిన రైతులు నష్టపోకుండా ఏదోరకమైన ప్రయోజనం దక్కేలా చూడాలని వ్యవసాయశాఖ జెడి శ్రీధర్‌కు సూచించారు. పరిహారం కోసం నిబంధనలు, మార్గదర్శకాలు అని చూడకుండా రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఈ సంవత్సరం ఎటువంటి లక్ష్యం, పరిమితి లేదని, పండిన ధాన్యమంతా కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం రవాణా చేసే వాహనాలకు జిపిఎస్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నేతాజీ, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎ.సత్యనారాయణ, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.