Jul 04,2022 22:50

చెత్తసేకరణ కోసం నగర పాలక సంస్థకు వచ్చిన ఆటో రిక్షాలు.

చిత్తూరులోనూ వాలంటీర్ల ద్వారా వసూళ్లు
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌, గ్యాస్‌, ఆర్‌టిసి చార్జీలతో సతమతమౌతున్న ప్రజలపై ఆగస్టు నెల నుండీ చెత్తపన్ను పేరుతో అదనపు భారం పడనుంది. ఇంట్లో చెత్త బయట పారేయడానికి వీలు లేదు. ఇంటింటా చెత్త సేకరణ పేరుతో నగర పాలక సంస్థ తడిచెత్త-పొడ్డిచెత్తను వేరుచేసేలా ప్రతి ఇంటికి రెండు ( గ్రీన్‌, రెడ్‌) డబ్బాలను ఉచితంగా సరఫరా చేసింది. ఈ వేరు చేసిన చెత్తను కమ్యూనిటి కంపోస్టు యార్డుకు తరలించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మనం ఇష్టపడి పదో పరకో ఇస్తే పారిశుధ్య కార్మికులు మారు మాట్లాడకుండా ఇంట్లోని చెత్తను తీసుకుపోయేవారు. అయితే ఆగస్టు నెల నుండీ డబ్బుల్వికుండా చెత్తను ఇవ్వడం కుదరదు.
మన ఇంటిముందుకు చెత్తను తరలించే ఆటో వస్తుంది. అందుటో తడిచెత్త-పొడిచెత్త వేరుగా వేసేలా రెండు రకాల అరలుంటాయి. వీటిల్లో మనం గ్రీన్‌, రెడ్‌ బుట్టల్లో తీసుకొచ్చిన తడిపొడి చెత్తను వేరు, వేరుగా వేయాల్సి ఉంటుంది. ఇలా నెల రోజులు మన ఇంటి చెత్తను కంపోస్టు యార్డుకు తరలించేందుకు ఉపయోగించిన ఆటోలకు అయ్యే ఖర్చును మనమే భరించాల్సి ఉంటుంది. ఇందు కోసం నగర పాలక సంస్థ అధికారుల ఆదేశాల మేరకు వాలంటీర్‌ లేదా మున్సిపల్‌ సిబ్బంది మన వద్ద నుండీ నెలకు రూ. 70 వసూలు చేయనున్నారు. అదే కిరాణా షాపు లేదా ఇతర షాపుల వద్ద నుండీ నెలకు రూ. 200 నుంచి 300 చెత్త పన్ను చెల్లిచాల్సి ఉంటుంది. ఇదెక్కడి కర్మరా బాబు అంటూ మన ఇంటి పరిసరాల్లో ఖాళీ జాగా ఉంటే అక్కడ చెత్తను పారబోద్దాం అని అతితెలివి తేటలు ప్రదర్శిస్తే ఆ చెత్త ఎవరు వేశారు అంటూ చుట్టుపక్కల వాళ్ళుద్వారా గుర్తించి పరిసరాల పరిశుభ్రత పేరుతో అదనంగా వసూలు చేస్తారు. ఇళ్లు, షాపులు, విద్యా సంస్థలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటి సెంటర్లు, ఫంక్షన్‌ హాల్స్‌, సినిమా థియేటర్లు వీటిలో చెత్త పన్ను ఎంత వసూలు చేయాలనేది ప్రభుత్వం నుండీ స్పష్టంగా పురపాలిక, నగర పాలిక సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. చెత్తపన్ను వసూలుపై వాడీవేడిగా నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో చర్చనడిచింది. మెజార్టీ సభ్యులు కళ్యాణ మండపాలు, సినిమాథియేటర్లు, ఫంక్షన్‌ హాల్‌లో, షాపింగ్‌ మాల్స్‌లో చెత్తపన్నులు వసూళ్లను సమర్థించినా ఇంటింటా చెత్తపన్ను వసూళ్లను వ్యతిరేకించారు. ప్రభుత్వం చెత్తపన్ను వసూలుపై స్పష్టంగా ఆదేశించిందని ఇందులో మినహాయింపు ఉండబోదని ఖచ్ఛితంగా వసూలు చేయాల్సిందేనని చెబుతూనే కౌన్సిల్‌ సభ్యుల అభిప్రాయం ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలతో ఆగస్టు ఒకటో తేది నుండీ చెత్తపన్ను వసూలు చేసేందుకు నగర పాలక సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని వాలంటీర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
చెత్తపన్ను ఖచ్ఛితంగా చెల్లించాల్సిందే
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటో తేది నుండీ నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో చెత్తపన్ను అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ప్రతి ఇంటికి రూ. 70, షాపింగ్‌మాల్‌, కిరాణాషాపులు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్‌, సినిమాథియేటర్లు, హాటల్స్‌, బార్బర్‌షాపులు ఇలా ఏ వాణిజ్య షాపు నుండీ ఎంత వసూలు చేయాలనేది ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. రూ. 500 నుంచి 1200 వరకు నెలకు చెల్లించాల్సి ఉంటుంది. తడిపొడి చెత్తను వేరువేరుగా సేకరించేందుకు 11 ఆటో రిక్షాలు చిత్తూరు నగర పాలక సంస్థకు వచ్చాయి. మరి కొన్ని రానున్నాయి.
డాక్టర్‌. అరుణ నగర కమిషనర్‌