Aug 22,2023 21:49

విశ్రాంత సైనికులను సన్మానిస్తున్న జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన

              ప్రజాశక్తి-అనంతపురం   భారత్‌ను అగ్రరాజ్యాల సరసన నిలిపేందుకు భారతపౌరులు, విద్యార్థులు కృషి చేయాలని జెఎన్‌టియు ఉపకులపతి రంగజనార్ధన పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జెఎన్‌టియు అనుబంధ ఓటీపీఆర్‌ఐలో నాభూమి-నాదేశం కార్యక్రమంలో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు మంగళవారం ఓటీపీఆర్‌ఇ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం పంచప్రాన్‌ ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరులు, వీరవనితలకు వందనం సమర్పించారు. ఉపకులపతి జి.రంగజనార్ధన మాట్లాడుతూ సైనికులు దేశానికి ఎంతో గొప్ప సేవలు అందిస్తున్నారన్నారు. వారిని సన్మానించడం మనకు గొప్ప అవకాశమన్నారు. దేశ ఔనత్యానికి తమ జీవితాలను త్యాగం చేసిన వీరులు, వీరమాతలకు వందనం సమర్పించి, భావి తరాల వారు, వారి త్యాగ నిరతికి అలవరుచుకుని భవిష్యత్‌లో మన దేశాన్ని ఇంకా ప్రగతి పథంలో నిలిపి, అగ్ర రాజ్యాలలో గుర్తింపు పొందడానికి కృషి చేయాలన్నారు. మన దేశ పౌరులందరూ నిజాయితీగా విధులు నిర్వహించాలన్నారు. అనంతరం రిటైర్డ్‌ సైనికులు ఎస్‌.వెంకటేష్‌ జెసిఒ, విశ్రాంత ఆర్మీ ఆఫీసర్‌ ఎం.ఖాసీంసాహెబ్‌ను సన్మానించారు. రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌ మాట్లాడుతూ మొట్టమొదటగా ప్రతి పౌరుడు దేశ అభివృద్ధి కోసం పాటు పడాలన్నారు. రాబోయే కాలంలో మన దేశాన్ని మరింత అభివృద్ధి చెందేలా దృష్టి సారించాలన్నారు. ఓటీపీఆర్‌ఐ సంచాలకులు బి.దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ కళాశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తర్వాత కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సి.గోపీనాథ్‌, పీఆర్‌ఓ ఎం.రామశేఖరరెడ్డి, అసిస్టెంట్‌ ప్రభాకర్‌, ఎంఎస్‌ఎస్‌ ఆఫీసర్లు కె.ఇ.శైలజ, మధు, ఓటీపీఆర్‌ఐ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.