Jun 28,2023 21:51

అగ్నిమాపక రక్షణ పరికరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

       అనంతపురం : జిల్లాలో ఉన్న అగ్నిమాపక సేవా సిబ్బంది సమన్వయంతో పనిచేసి అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్‌ ఎం.గౌతమి ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురంలోని జిల్లా అగ్నిమాపక శాఖ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వం ద్వారా రూ.15 లక్షల వ్యయంతో మంజూరైన 199 వివిధ విపత్తుల నివారణకు సంబంధించిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అగ్నిమాపక సేవా సిబ్బంది, రక్షణ, పునరావస కార్యక్రమాల్లో బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వివిధ రకాల అగ్ని ప్రమాదాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజల్లో విస్తతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డిని సూచించారు. విపత్తు సమయాల్లో అప్రమత్తంగా ఉండి జరిగే నష్టాలను నియంత్రించే విధంగా ప్రస్తుత పరికరాలను ఉపయోగించాలన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను కాపాడేందుకు అగ్నిమాపక శాఖ అన్ని విధాల సంసిద్ధులై ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి కెపి.లింగమయ్య, ఇతర అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.