ఆగని గజదాడులు
వంగసానివారి పల్లెకు చేరిన ఏనుగుల
టమోటా, వరి పైరు ధ్వంసం
నష్టపరిహారం ఇప్పించాలంటున్న రైతులు
ప్రజాశక్తి- సోమల
మండలంలోని పెద్దఉప్పరపల్లి, అన్నెమ్మగారిపల్లె, పెటూరు పరిసర అటవీప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తూ అప్పుడప్పుడు సమీప పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. అయితే శుక్రవారం రాత్రి ఆవులపల్లె పంచాయతీ వంగసానివారిపల్లె గ్రామానికి చెందిన పలువురు రైతుల టమోటా, వరి పైరుపై ఏనుగుల గుంపు దాడి చేసి తీవ్రంగా నష్టపరిచాయని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 8 ఏనుగులు అటవీ సమీప వ్యవసాయ పంట పొలాలపై రాత్రి వేళల్లో దాడులు చేస్తూ చేతికి అంది వచ్చిన పంటను నాశనం చేస్తూ తమకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని గ్రామానికి చెందిన బాలాజీ, నాగరాజా రైతులు ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ సిబ్బంది ఏనుగుల గుంపును మండలం నుండి శాశ్వతంగా తరలించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.










