ఆగని గజదాడులు
ఆందోళనలో రైతులు
పొలాల్లోనే ప్రసవించి ఏనుగు
మరో 15 రోజులు పంపలేమంటున్న అటవీ శాఖ అధికారులు
ప్రజాశక్తి- వికోట : వి.కోట మండలంలో పంట పొలాలపై ఏనుగుల దాడులు ఆగడం లేదు. ఏనుగులు యధేచ్ఛగా గ్రామాల్లో సంచరిస్తుండటంతో అన్నదాతలు పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్ధితి. గత కొన్ని రోజులుగా గజ దాడులతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి కుమ్మరమడుగు గ్రామ సమీపంలోని పంట పొలంలో ఏడు ఏనుగులు గుంపుగా ప్రవేశించాయి. గోపాలప్ప అనే రైతుకు చెందిన రెండు ఎకరాల రాగి పంటను తొక్కి నాశనం చేశాయి. అలాగే అర ఎకరం మొక్కజొన్న పంటను తిని మిగిలిన పంటను ధ్వంసం చేశాయి. అంతేకాకుండా నీటి సరఫరా పైపులు, గేట్ వాల్‌లను తొక్కేశాయి. దీని వలన సుమారు రూ.3లక్షల నష్టం వాట్లిలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఏనుగుల గుంపులోని ఓ ఆడ ఏనుగు పొలంలోనే ప్రసవించింది. దీంతో పిల్ల ఏనుగు లేచి తప్పటడుగులు వేస్తూ నడిచే వరకు అవి అక్కడే ఉండిపోయాయి. అనంతరం ప్రసవించిన ఏనుగు, దాని పిల్ల అడవిలోకి ఆలస్యంగా వెళ్లడంతో మిగిలిన ఏనుగులు అటవీ సరిహద్దు వద్ద గుంపుగా వేచి ఉన్నాయి. ఈనేపథ్యంలో అటవీశాఖ ట్రాకర్స్ ఏనుగులను మళ్లించేందుకు ప్రయత్నించగా ఏనుగు ఈనడంతో అవి మనుషులపై తిరబడ్డాయి. దీంతో ట్రాకర్స్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. అనంతరం బాణాసంచా పేల్చి వాటిని అడవిలోకి మళ్లించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నయీం ఆలీ పంట నష్టాన్ని, ఏనుగు ప్రసవించిన చోటును పరిశీలించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ సరిహద్దు రైతులు ఏనుగుల సంచారం పట్ల అప్రమ్తంగా ఉండాలని సూచించారు. మరో 15 రోజుల్లో ఈ అటవీ ప్రాంతం వదిలి ఏనుగులు వెల్లవని, ఏనుగు పిల్ల పూర్తిగా నడిచే వరకు వాటిని మళ్లించడం కష్టమని స్పష్టం చేశారు. ఏనుగుల వలన ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అటవీశాఖకు సంమాచారం అందించాలని కోరారు. వి.కోట డిప్యూటీ రేంజ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి, బీట్ అధికారులు చరణ్, రమేష్, కిరణ్ కుమార్, తదితరులు ఉన్నారు.










