Sep 26,2023 21:44

తేజేశ్వరరావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు

* అంగన్వాడీల నిరసనకు హాజరు కాకుండా
* సిపిఎం, సిఐటియు నాయకుల ముందస్తు అరెస్టులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌, పలాస : 
అంగన్వాడీల చలో విజయవాడ నేపథ్యంలో రెండు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు నాయకులను ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేసిన పోలీసులు మూడో రోజు మంగళవారం కూడా కొనసాగించారు. అంగన్వాడీ వర్కర్స్‌పై పోలీసుల నిర్బంధానికి నిరసనగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంతో, ఆ కార్యక్రమాన్ని భగం చేసేందుకు నాయకులను గృహ నిర్బంధాలు చేశారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్‌ కూడలి వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరిన సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కె.సూరయ్య, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ కె నాగమణి, ఆదిలక్ష్మి, పలాసలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతిని గృహ నిర్బంధం చేశారు. ఉదయం ఆరు గంటలకే పోలీసులు వారి ఇళ్లకు చేరుకుని హౌస్‌ అరెస్టు చేశారు.
ప్రజాస్వామ్య హక్కులపై ప్రభుత్వం దాడి
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు విమర్శించారు. అంగన్వాడీలపై నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదని హెచ్చరించారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై సాగిస్తున్న నిర్బంధానికి స్వస్తి పలికి, న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలపై నిర్బంధానికి నిరసనగా నగరంలోని హెచ్‌.బి కాలనీ కూడలి వద్ద అంగన్వాడీలు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా కాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా, పలురూపాల్లో ఆందోళనలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా రూ.వెయ్యి వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వాగ్దానం చేశారని, తెలంగాణలో రూ.13,500 వేతనం ఇస్తున్నా నేటికీ సిఎం ఇచ్చిన హామీ అమలు చేయడం లేదన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. రకరకాల యాప్‌లు తెచ్చి అంగన్వాడీలపై పనిభారం పెంచారని ఆవేదన వ్యక్తం చేసారు. అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.ఐదు లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు మెయిన్‌ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలని, ఉద్యోగోన్నతుల్లో రాజకీయ జోక్యం అరికట్టాలని కోరారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బి.రాజేశ్వరి, కె.ప్రమీలాదేవి తదితరులు పాల్గొన్నారు.