Aug 17,2023 21:57

గుంతల మయంగా మారిన వేపరాల క్రాస్‌ రోడ్డు

        రాయదుర్గం రూరల్‌ : మండల పరిధిలోని వేపరాల క్రాస్‌ రోడ్డు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. పలు ప్రాంతాలకు వెళ్లేందుకు అనుసంధానంగా ఈ రహదారి ఉంది. కళ్యాణదుర్గం, బెలుగుప్ప ప్రాంతాలకు చెందిన వారు కనేకల్‌, బళ్ళారి ప్రాంతాలకు వెళ్లాలంటే వేపరాల క్రాస్‌ మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంది. అనంతపురం - రాయదుర్గం జాతీయ రహదారి ఉపయోగంలోకి రాని సమయంలో ఈ మార్గమే (గుండ్లపల్లి రోడ్డు) ప్రధానంగా వినియోగంలో ఉండేది. గతేడాది కురిసిన వర్షాలతో పాటు, బైరవానితిప్ప ప్రాజెక్ట్‌ నుంచి వేదవతి హగరి పరివాహక ప్రాంతం నెలలపాటు ఏకధాటిగా ప్రవహించింది. దీంతో వేపరాల (రాయదుర్గం మండలం), గుండ్లపల్లి(బెలుగుప్ప మండలం) మధ్య ఉన్న కాజ్వే కొట్టుకుపోయింది. వేపరాల క్రాస్‌ నుంచి కాజ్వే దాటగానే గుండ్లపల్లి (బెలుగుప్ప మండలం, ఉరవకొండ నియోజకవర్గం), గుండ్లపల్లి దాటగానే కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాలను అనుసంధానిస్తూ ఈ రహదారి ఉండేది. రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం మీదుగా అనంతపురం వెళ్లేందుకు గతంలో ఈ రహదారి ఉపయోగంలో ఉండేది. గత ఏడాది జాతీయ రహదారిని అనుసంధానిస్తూ వేదవతి హగిరిపై నూతనంగా నిర్మించిన వంతెన ఉపయోగంలోకి రావడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొంతకాలానికి వేదవతి ప్రవాహంతో పాత కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో తప్పనిసరిగా కనేకల్‌, బళ్ళారి - కళ్యాణదుర్గం వైపు వెళ్లే వాహనాలు కూడా జాతీయ రహదారిపై ప్రయాణించాల్సి వచ్చింది. ప్రస్తుతం వేపరాల క్రాస్‌ సమీపంలో ఇసుకరీచ్‌ ఉండడంతో టిప్పర్లు ఎక్కువ సంఖ్యలో రోజు తిరుగుతుంటాయి. దీంతో ఈ రోడ్డు గుంతల మయంగా మారి మరింత అధ్వానంగా తయారైంది. గతంలో కళ్యాణదుర్గం నుంచి బళ్లారికి కూరగాయలను తీసుకెళ్తున్న వాహనం గుంతలను తప్పించబోయి బోల్తా పడింది. ఇటీవల పరుపులను తీసుకెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి పడిపోయింది. ఇలాంటి ఘటనలు ఈ రోడ్డులో తరచూ జరుగుతున్నాయని వేపరాల, నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డు మలుపులో గుంతలు ఉండడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతలు లేకుండా రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వేపరాల గ్రామస్తులు కోరుతున్నారు.
జాతీయ రహదారికి మార్పు...
గతంలో రోడ్లు మరియు భవనాలు శాఖ పరిధిలో ఉన్న ఈ రోడ్డు జాతీయ రహదారికి అప్పగించినట్లు ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రవిశంకర్‌ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై నేషనల్‌ హైవే అసిస్టెంట్‌ ఇంజినీర్‌ శ్రీనివాసులును ప్రజాశక్తి వివరణ కోరగా వేపరాల క్రాస్‌ నుంచి గుండ్లపల్లి మీదుగా జాతీయ రహదారిని అనుసంధానించేలా పది మీటర్ల వెడల్పుతో రెండున్నర కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు, కొట్టుకుపోయిన కాజ్వే స్థానంలో నూతన కాజ్వే నిర్మాణం చేసేందుకు 29 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో గత ఏడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. నిధులు మంజూరు కాగానే పనులను చేపడతామన్నారు.