Sep 26,2022 22:53

అధ్వానంగా దళితవాడ
వేపనపల్లిలో సమస్యల తిష్ట...
గ్రామాల పారిశుధ్యం గురించి
పట్టించుకోని పాలకులు, అధికారులు
ప్రజాశక్తి- యాదమరి :

మండలంలోని కష్ణంపల్లి గ్రామపంచాయతీ వేపనపల్లి ఆది ఆంధ్రవాడలో సమస్యలు తిష్ట వేయండతో పాటు దోమలు రాజ్యమేలుతున్నాయి. ఈ గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈనెల సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు అందరి భాగస్వామ్యంతో ప్రతి గ్రామపంచాయతీలో గ్రామాల్లో పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే గ్రామ సచివాలయ అధికారులు మాత్రం పారిశుధ్య వారోత్సవాలకు తమకు ఎటువంటి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.
మండల పరిధిలో దళితవాడలు మారుమూల అటవీప్రాంత వైపు ఉండడంతో ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఎవరు పట్టించుకోవడం లేదు. పాలకులు అభివద్ధిపై దష్టి పెట్టకపోగా దళితవాడల్లో మౌలిక సదుపాయాలైన తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామంలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ లేకపోవడంతో శుభ్రమైన తాగునీరు అందడం లేదు. దీనికి తోడు వీధుల్లోని మురుగునీటి కాలువలు వ్యర్థాలతో పేరుకుపోయి మురుగు రోడ్లపై ఏరులై పారుతోంది.
గ్రామంలోని తాగునీటి పైపులైను రెండు మూడు చోట్ల లీకేజీ కావడంతో నీరు కలుషితమై గ్రామస్తులు అనేక వ్యాధులకు గురై జ్వరాల భారినపడుతున్నారు. తాగునీటి కాలుష్యం, పారిశుధ్య లోపం కారణంగా ఇటీవల గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు, పెద్దలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైరల్‌ ఫీవర్‌తో చికిత్స పొందారు. గ్రామపరిధిలో డ్రైనేజీ కాలువ పిచ్చిమొక్కలతో మట్టితో పూర్తిగా పూడిపోయింది. ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన తాగునీటి తొట్టెలో నీరుపాచి పట్టి దోమలకు నిలయంగా మారింది. గ్రామసరిహద్దుల్లో ఏర్పాటు చేసుకోవాల్సిన పేదదిబ్బలను వీధుల పక్కనే వేయడంతో పురుగులు, ఈగలు ఎక్కువగా నివాసప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గ్రామస్తులు ఎక్కువ మంది విషజ్వరాలు బారిన పడుతున్నారు.
గ్రామస్తులు పంచాయితీ అధికారులకు, తాగునీరు లీకేజీ పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని పలుసార్లు విన్నవించిన ఫలితం లేకుండాపోయిందని వాపోతున్నారు. అధికారులు, గ్రామ సర్పంచ్‌ సైతం గ్రామం వైపు రావడం లేదంటూ దళితవాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వేపనపల్లి నుంచి గ్రామంకు వచ్చే రోడ్డు సైతం రాళ్లుతేలి ప్రయాణానికి తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. దళితవాడ గ్రామం చుట్టూ మాగాని భూములు ఉన్నాయని వీధుల్లో లైట్లు కూడా సరిగా వెలగడంలేదని, చుట్టుపక్కల అటవీప్రాంతం, మామిడితోపులు ఉండడంతో తరచూ విషసర్పాలు, తేళ్లు వంటివి సంచరిస్తుంటాయని తెలిపారు. దీని వలన రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే పెద్దలు, వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలు ప్రమాదాల భారిన పడే అవకాశాం ఎక్కువగా ఉందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే దళితవాడలోని సమస్యలు పరిష్కరించాలని దళితవాడ ప్రజలు వేడుకుంటున్నారు.
పైపులైన్‌ లీకేజీ బాగు చేయండి
- రాధమ్మ, వేపనపల్లి ఆది ఆంధ్రవాడ
మూడు నెలలుగా తాగునీరు పైపులైన్‌ లీకేజీ అవుతోంది. పైపు లీకేజీ కావడంతో తాగునీరు డ్రైనేజీతో కలిసి కలుషితమవుతోంది. అంతేకాకుండా వీధుల్లో నీరు వృథాగా పోతున్నాయి. దీనివలన నీరు నిల్వ ఏర్పడి దోమలు పెరుగుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టాలి.
డ్రైనేజీ కాలువలో పూడిక తీయండి
- భాస్కర్‌ వేపనపల్లి ఆదిఆంధ్రవాడ
గ్రామంలో డ్రైనేజీ కాలువలు పూర్తిగా పూడిపోయి మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. వేపనపల్లి నుండి రోడ్డులో రాళ్లు తేలిపోవడంతో రాత్రుల్లో గ్రామానికి రావాలంటే తీవ్రఇబ్బందులు తప్పడం లేదు. పలుమార్లు రాళ్ల కారణంగా ప్రమాదాలు జరిగిన సందర్భాలూ లేకపోలేదు.
ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య వారోత్సవాలు
- లక్ష్మీ, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోనూ పారిశుద్ధ్య వారోత్సవాలను చేపడుతున్నాం. ఈ మేరకు గ్రామసచివాలయ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులకు సర్క్యులర్‌ జారీ చేయడం జరిగింది. గ్రామాల్లో పారిశుధ్యం చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అలాగే పారిశుద్ధ్యం చేపట్టిని గ్రామాలను పరిశీలించి వెంటనే పనులు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.