Jun 24,2022 23:19

సర్పంచులు చెప్తున్న సమస్యలను వింటున్న జెడ్పీ చైర్మన్‌

ప్రజాశక్తి -గుడిపల్లి : మండలంలో శుక్రవారం నాడు మండల మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ వాసు మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేయాలన్నారు. గుడిపల్లి సర్పంచ్‌ పి.ఆర్‌.ఏఈ తమ మాట వినడం లేదని చెప్పడంతో ఆయన ఆగ్రహంతో ఇష్టముంటే ఇక్కడ పనిచేయాలని సర్పంచులకు గౌరవం ఇవ్వాలని లేకుంటే బదిలీ పెట్టుకొని వేరే మండలానికి వెళ్లి పోవాలని ఆయన హెచ్చరించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదని జగనన్న ప్రభుత్వం అని ఆయన సున్నితంగా అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా గుండ్ల సాగరం సర్పంచ్‌ మాట్లాడుతూ ఇంటి పట్టాలు అనుకూలమైన స్థలంలో ఇవ్వకుండా కొండల్లో ఇచ్చారని దానివలన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దష్టికి తీసుకుని వచ్చారు. కొంతమంది సభ్యులు మాట్లాడుతూ గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ముఖ్యంగా వీటిని పరిష్కరించాలని జెడ్పీ చైర్మన్‌ వాసు దష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన మాట్లాడుతూ తప్పకుండా రెండు నెలల కాలంలో డ్రైనేజీ వ్యవస్థను చేయడానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీలు సమన్వయంతో గ్రామాల్లో పనిచేయాలని అప్పుడే ప్రజలకు మేలు చేసిన వారం అవుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వరలక్ష్మి గోపి, జెడ్‌పిటిసి కష్ణ మూర్తి, సర్పంచులు చంద్రాయన్‌, వెంకటేష్‌, నారాయణ, భాస్కర్‌, గోపాల్‌, దేవప్ప నాయుడు, నాగరాజు, ఎమ్మార్వో, ఎంపీడీవో శంకర్‌, ఎంపీటీసీలు, అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు.