
* 'జగనన్నకు చెబుదాం'లో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - లావేరు : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో మండలస్థాయి 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 39 వినతులను స్వీకరించారు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో మిశ్రమ స్పందన లభించింది. మండలంలో రహదారులు నిర్మించాలని, మండల పరిషత్ కార్యాలయానికి నూతన భవనం మంజూరు చేయాలని, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. లావేరుకు చెందిన పలువురు జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, గతంలో గ్రామానికి దూరంగా కొండ దగ్గర కేటాయించారని, తమకు గ్రామానికి అందుబాటులో ఉండే విధంగా ఇళ్లు ఇవ్వాలని పలువురు కోరారు. ఇళ్లు నిర్మించినా బిల్లులు చెల్లించలేదని మరికొందరు వినతిపత్రాలు అందజేశారు. భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. రణస్థలం నుంచి వేణుగోపాలపురానికి రహదారి వేయాలని గుమ్మాడం పంచాయతీ ప్రజలు గుర్రాలపాలెం గ్రామాన్ని ప్రత్యేక రెవెన్యూగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అదపాక నుంచి పైదాయవలస వరకు ఆర్‌టిసి బస్సు సదుపాయం కల్పించాలని కోరారు. తాళ్లవలస, తమూరు గెడ్డ వాగు గండి పూడ్చాలని తాళ్లవలస గ్రామస్తులు వినతిపత్రాలు అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారానికోసారి సమావేశాలు నిర్వహించి గర్భిణులకు, బాలింతలకు పౌష్టిహారాన్ని సక్రమంగా అందించాలని ఎఎన్‌ఎం, అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు. ఎనిమిది రకాల సర్వీసుల్లో వెనుకబడి ఉన్నారని, దీనిని సరిదిద్దుకుని సక్రమంగా సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌పి జి.ఆర్ రాధిక, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎంహెచ్‌ఒ బొడ్డేపల్లి మీనాక్షి, డిఆర్‌ఎడి పీడీ విద్యాసాగర్, జెడ్‌పి సిఇఒ వెంకటరమణ, ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ జయదేవ్, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, తహశీల్దార్ దిలీప్‌చక్రవర్తి, ఎంపిడిఒ కె.సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.