అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
అధికారుల నిర్లక్ష్యం ఏ మేరకు ఉంటుందో వారివల్ల సామాన్య ప్రజలు ఏవిధంగా ఇబ్బంది పడతారో రైతు రాజన్న మతితో వెలుగులోకి వచ్చింది. ఆఖరికి కోర్టు వరమిచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయనకు మరణమే గత్యంతరంగా మిగిలింది.
జిల్లాలో పెనుమూరు తహశీల్దారు కార్యాలయం ముందు రెండు రోజులుగా రైతు రత్నం నిరాహార దీక్ష నిర్వహించాడు. ఆయన తన భూమిని కొంతమంది ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని.. ఈ విషయమై కోర్టులో కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారని ఈ విషయమై తనకు న్యాయం చేయాలని నిరసన దీక్ష చేపట్టారు. అన్న ఆహారాలు మాని తనకు న్యాయం చేయాలంటూ దీక్ష పూనారు. ఈ విషయంపై అధికారులతో చర్చిస్తుండగా వాళ్లందరి ముందరే కుప్పకూలి పోయారు. 45 సంవత్సరాలుగా ఆయన పోరాటం నిర్వహిస్తున్నాడు. అయినా అధికారుల్లో చలనం లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్య వైఖరి తట్టుకోలేక అసువులు బాసారు. చిత్తూరు జిల్లా కేంద్రమైన చుట్టుపక్కల మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. పెనుమూరు తహశీల్దార్ పై అనేక రకాల ఆరోపణులున్నాయి. యాదమరి తవణంపల్లి బంగారుపాలెం, జీడినెల్లూరు, ఐరాల మండలాల్లో పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఒకరి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేరుపై ఆన్లైన్‌లోకి ఎక్కించడం, మరికొందరు పట్టా పాసుబుక్ వివరాలను ఆన్లైన్లోనికి ఎక్కించి లబ్ధి పొందాలని ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. తహశీల్దార్, ఆర్డీఓ, డిఆర్‌ఓ కార్యాలయం కార్యాలయాలకు ఎక్కువగా ఈ భూములకు సంబంధించిన ఫిర్యాదులే అందుతున్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఎక్కువ మొత్తంలో రైతుల భూములకు సంబంధించిన విడవల్లి విషయంపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని రెవెన్యూ రికార్డులను తమ గుప్పెట్లో ఉంచుకుని కోట్లు గడిస్తున్నారు. దీంతో ఎక్కువమంది బాధితులు కలెక్టర్‌ను, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడ పరిష్కారం దొరికిన క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు మాత్రం రైతులను నరకయాతం పెడుతున్నారు. అందులో భాగంగానే మండల కేంద్రంలో రైతు తహశీల్దార్ కార్యాలయంలోని అధికారులతో మాట్లాడుతూ ఉన్నఫలంగా కూలిపోయారు. దీనిని బట్టి పరిస్థితి ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది.










