జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులు సతమతం
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాలన్
వంకాయపాలెం లేఅవుట్ పరిశీలన
ప్రజాశక్తి - పాలకోడేరు
'సెంటున్నర స్థలం ఇచ్చారు.. అదీ ఊరికి దూరంగా నివాసయోగ్యం కాని స్థలం.. కనీసం పూడిక చేయలేదు.. ఇల్లు కట్టుకోవాలని.. లేకపోతే స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది సరైన పద్దతి కాదు' అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్ విమర్శించారు. ఒకపక్క అధికారుల బెదిరింపులు తాళలేక, మరోపక్క ఇళ్లు నిర్మించుకోలేక జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంటి నిర్మాణానికి రూ.ఆరు లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. విస్సాకోడేరు పంచాయతీ పరిధిలోని వంకాయపాలెంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్‌ను మంగళవారం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు అనేక సమస్యలను సిపిఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం గోపాలన్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కనీసం పూడిక చేయకపోవడం దుర్మార్గమన్నారు. గ్రామానికి దూరంగా నివాసయోగ్యం లేనిచోట లేఅవుట్ ఏర్పాటుచేసి ఇళ్ల స్థలాలు అందజేయడం దారుణమన్నారు. పెన్నాడ, బంటుమిల్లి, శృంగవృక్షం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఆక్వా చెరువులు, కాలువలు ఉన్నచోట ప్రభుత్వ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారని, ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుంటే ఇబ్బందులు ఏర్పడనున్నాయని తెలిపారు. తక్షణం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి అందించాలని, లేనిపక్షంలో రూ.6 లక్షలు ఇంటి నిర్మాణం నిమిత్తం లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శేషపు అశ్రియ్య, కలిదిండి గోపాలరాజు, సుబ్బారావు, కళ్యాణి, డి.ప్రసాద్, ఆంజనేయులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










