Oct 17,2023 19:41

మాట్లాడుతున్న పనబాక లక్ష్మీ

మాట్లాడుతున్న పనబాక లక్ష్మీ
అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ :రాష్ట్రంలో ముఖ్యమంత్రి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారం శాశ్వతమని ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకుని పాలన సాగించాలని టిడిపి నెల్లూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి పేర్కొన్నారు. నెల్లూరు నగర టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్ర ప్రజలు నడిరోడ్డున నిలబడ్డారని నేనున్నానని చంద్రబాబు నాయుడు ప్రజలకు భరోసా కల్పించి సుందరమైన రాజధానితోపాటు అభివద్ధికి బాటలు వేశారన్నారు. అంతేకాకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు పరిశ్రమలు స్థాపించి రాష్ట్ర గౌరవం నింపారన్నారు.
వైస్‌ జగన్మోహన్‌ రెడ్డికి పాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారం చేయడంతో ప్రజల్లో అసంతప్తి వచ్చిందన్నారు. ప్రభుత్వం మళ్లీ రాదని టిడిపి వస్తుందని భావించి ప్రతిపక్ష నేతలపై నారా చంద్రబాబు నాయుడు పై కక్షగట్టి కుట్రపూరితంగా కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారన్నారు. జైల్లో వసతులు కల్పించకుండా అనారోగ్యంగా ఉన్న ఆయనపై వైసీపీ మంత్రులు నేతలు హేళనగా మాట్లాడుతున్నారన్నారు. డిప్యూటీ సిఎం నారాయణస్వామి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మీ ఇంట్లో మహిళలను కూడా అనుమానిస్తారా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నాలుక తీసేసిన పాపం లేదన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి దళితులపై అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగినా అడగలేని వారు ఇవాళ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయాల్లో ఉండే అర్హత వారికి లేదన్నారు. మానవత్వం మరిచి సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని మహిళలపై మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి సిగ్గుపడుతూ చిరునవ్వులను చిందిస్తున్నాడని, రాబోవు ఎన్నికల్లో మహిళలు ఇలాంటి నేతలను రాజకీయాలనుంచి బహిష్కరించడం తథ్యమన్నారు.కార్యక్రమంలో టిడిపి మహిళ నేతలు రేవతి, విజయమ్మ, సుశీలమ్మ, శివలక్ష్మి, శ్రీదేవి, పద్మజ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు