Apr 28,2023 22:03

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంంత, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌

           ప్రజాశక్తి-అనంతపురం   తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటామిరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం నగరంలోని 40వ డివిజన్‌లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఆయా లబ్ధిని తెలుసుకునేందుకు సుమారు ఏడాది కాలంగా గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. దీంతో జగన్‌ నాయకత్వం పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు తోడు సచివాలయ వ్యవస్థ పనితీరు బాగుందని ప్రజలు చెబుతున్నారన్నారు. జనం సంతోషంగా ఉంటే చంద్రబాబు మాత్రం బాధపడు తున్నాడన్నారు. 14 ఏళ్లు సిఎంగా పని చేసిన చంద్ర బాబు ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నా రు. అందుకే ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డుపెట్టు కుని ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం రాదన్న ఫ్రస్టేషన్‌లో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్ల విజన్‌ లేదని, కేవలం అధికారంలోకి రావడం మాత్రమే ఆయన విజన్‌ అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని తెలిసి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా అన్నివర్గాలకూ న్యాయం చేసిన వ్యక్తిగా జగన్‌ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ మొహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఫయాజ్‌, జేసీఎస్‌ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, కార్పొరేషన్ల డైరెక్టర్లు గౌస్‌బేగ్‌, శ్రీనివాసులు, వైసీపీ బీసీ విభాగం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ రమేష్‌గౌడ్‌, వైసీపీ నాయకులు ఖాదర్‌, షరీఫ్‌, సందీప్‌, ఇసాక్‌, నల్లప్ప, గుజ్జల లక్ష్మణ్‌, గౌతమి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.