అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
నగర కమిషనర్ అరుణ
వర్షంలోనే లోతట్టు ప్రాంతాల పర్యటన
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరపాలక అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ ఆదేశించారు. మరోరెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. కమిషనర్ శనివారం మధ్యాహ్నం వర్షంలోనే నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వీరభద్రకాలనీ, ధర్మరాజుల గుడిప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలకు తరలిరావాలన్నారు. రిక్షాకాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజారోగ్య విభాగం అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులకు మార్గనిర్దేశం చేశారు. వర్షాల కారణంగా ఎక్కడా నీరు నిల్వ చేరకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. నిల్వనీటిని తోలగించడానికి అవసరమైన మోటార్లు, ఇతర యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే రాత్రి సమయంలో అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలని అన్నారు. ప్రధానంగా నీవానది పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అత్యవసరమైతే బాధితులను వేగంగా పునరావాస కేంద్రాలకు తరలించడానికి ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. నీవా నది కల్వర్టర్లు ఉన్న ప్రాంతాల్లో నిఘా ఉంచాలని ఆదేశించారు. నగరంలో నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా, నీరు కలుషితం కాకుండా ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటిని క్లోరినేషన్ చేయించాలని, ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలి వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వార్డు స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అవసరమైన ప్రాథమిక మందులను అందుబాటులో ఉంచుకోవాలి అన్నారు. డీఈలు రమణ, వెంకట ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, లోకానాం, ఏఈలు, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.










