ప్రజాశక్తి-గుంతకల్లు ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు వారి అక్రమాలపై ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లు చేసుకోవడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మండిపడ్డారు. గుంతకల్లు పట్టణంలోని ప్రజా సమస్యలపై సిపిఎం నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం మూడవ రోజుకు చేరాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ వారి దీక్షలకు మద్దతు తెలిపారు. మూడవ రోజు సిపిఎం అనుబంధ కెవిపిఎస్ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వి.రాంభూపాల్ మాట్లాడుతూ ప్రజలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వారి సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రధాన నేతలు వారి వారి అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలపై వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లు చేసుకోవడమే కాకుండా దేవుళ్లను కూడా వారి కుళ్లు రాజకీయాల్లోకి ఈడ్చడం సిగ్గుచేటన్నారు. గత కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు ఆదాయ వనరుగా మారాయన్నారు. ఆర్థిక స్థోమత లేక ఇంటి నిర్మాణం చేసుకోలేని పేదల స్థలాలను వైసిపి నాయకులు దర్జాగా కబ్జా చేసి అమ్ముకుంటూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అందుకు ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతూ పేదలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా సాకుతో రెండేళ్లుగా శస్త్ర చికిత్స లు చేయడం లేదన్నారు. దీంతో గర్భిణులు కష్ట కాన్పులు ఉన్నపుడు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పులు చేసి రూ.లక్షలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. గుంతకల్లు పట్టణ శివారు కాలనీల్లో ప్రజలకు తాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. జగనన్న లేఅవుట్లలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లకు రూ.5 లక్షలు రుణం మంజూరు చేయాలన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అందుకే ప్రజా ధనంతో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం చేపట్టడం సిగ్గు చేటన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ బిజెపిపై తన వైఖరి మార్చుకోవాలన్నారు. బిజెపిని రాష్ట్రంలోకి తెస్తే ప్రజల నెత్తిపై నిప్పుల కుంపటి పెట్టినట్లు అవుతుందన్నారు. స్థానిక ప్రజా సమస్యలను అధికార, ప్రతిపక్ష పార్టీలు విస్మరించినా ఎర్రజెండా పార్టీ సిపిఎం విస్మరించదని అన్నారు. అందుకే రిలే దీక్షలు చేపట్టామన్నారు. వైసిపి ప్రజా ప్రతినిధులు అవినీతి, అక్రమాలకు ముందుండి.. అభివృద్ధికి దూరంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు లేక అనేక మంది నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి జీవనాన్ని గడుపుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా నాయకులు కళ్లుతెరిచి ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని లేనిపక్షంలో రాయలసీమ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. మూడవ రోజున కెవిపిఎస్ నాయకులు జగ్గలి రమేష్, రాము నాయక్, సురేష్, మల్లి, సల్మాన్ రాజ్, రాము, కృష్ణ దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు, కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మారుతి ప్రసాద్, కసాపురం రమేష్, ఐద్వా పట్టణ అధ్యక్షురాలు రంగమ్మ, అబ్దుల్లా, ఓబులేసు, షాషా, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.










