అధికార నందివాహనం పై ఏకదంతుని వైభవం
ప్రజాశక్తి- ఐరాల : కాణిపాకం స్వయంభూ శ్రీవరదిద్ది వినాయకస్వామి వారి దేవస్థానంలో ఆగస్టు 31 నుంచి జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు అధికార నంది వాహనంపై కాణిపాకం గ్రామ మాఢవీదులు గుండా ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. శుక్రవారంతో ఆలయంలో నవదిన వార్షిక బ్రహ్మౌత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. తిరిగి శనివారం నుంచి ప్రత్యేక ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ఈమేరకు వరుస ఉభయదార్లు అయిన కాణిపాకం గ్రామానికి చెందిన వళ్ళువర్ వంశస్థులు ఉభయదార్లుగా వ్యవహరించారు. స్వామివారి మూలవిరాట్‌కు వివిధ రకాల పరిమిళ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు, పంచా మతభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ ఎంవి.సురేష్ బాబు, ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మెన్ ఎ.మోహన్ రెడ్డి, ఏసి కస్తూరి, ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీ కష్ణారెడ్డి, హేమమాలిని, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ పి.బాబు, రమేష్‌లతోపాటు అర్చకులు, వేదపండితులు, ఉభయదార్లు, భక్తులు పాల్గొన్నారు.
కాణిపాకంలో వైభవంగా వేదసభ
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ది వినాయకస్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈసందర్భంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు నుంచి వేదపండితులు విచ్చేసి వేదపఠనం నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లోని 40 మంది వేదపండితులు విచ్చేసి ప్రధాన ఆలయ స్వామివారి కల్యాణవేదికలో ఆలయ ఈఓ ఎంవి.సురేష్ బాబు, ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్ ఎ.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా వేదపఠనం నిర్వహించారు.










