May 28,2023 21:42

ప్రారంభానికి సిద్ధం చేసిన నగరంలోని టవరక్లాక్‌ బ్రిడ్జి

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైన ప్రభుత్వపరంగానే  చేపట్టడం ఆనవాయితీ. అయితే అనంతపురం నగరంలో మాత్రం నూతనంగా నిర్మిస్తున్న టవర్‌ క్లాక్‌ బ్రిడ్జి ప్రారంభం మాత్రం అధికారపార్టీ కార్యక్రమంతో ప్రారంభమవడం చర్చనీయాంశమవుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల కావస్తున్న సందర్భంగా వైసిపి కార్యక్రమంలాగా స్కూటర్‌ ర్యాలీతో ఈ బ్రిడ్జి ప్రారంభించడం చర్చనీయాంశమవుతోంది.
రెండు రోజుల తరువాత రాకపోకలకు అనుమతి
నగరంలోని బళ్లారి బైపాస్‌ వద్ద ఎన్‌హెచ్‌44 నుంచి పంగల్‌ రోడ్డు వరకు 9.2 కిలోమీటర్ల మేరకు రహదారి నిర్మాణాన్ని రూ.198 కోట్లతో చేపట్టారు. గతేడాది 2022 అక్టోబరులో పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 2023 అక్టోబర్‌ నాటికి పనులు పూర్తికావాల్సింది. అయితే నిర్మాణ సంస్థ వేగంగానే పనులు చేపట్టింది. నిర్ణీత సమయానికి కంటే ముందే పనులు ముగించే విధంగా పనులు సాగాయి. ఇందులో ప్రధానమైనది అనంతపురం నగరం నడిబొడ్డున టవర్‌క్లాక్‌ వద్దనున్న ప్లైఓవర్‌ బ్రిడ్జి. దీని నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జిని ప్రారంభించాలన్న ఒత్తిడి కూడా నగరవాసుల నుంచి ఉంటోంది. ఎందుకంటే నగరం రెండు వైపులా కలిపే ప్రధానమైన బ్రిడ్జి ఇదే. అయితే ఈ బ్రిడ్జి ప్రారంభ సమయం కూడా ఆసన్నమైంది. సోమవారం ఉదయం ప్రారంభించాలని అనధికారిక ప్రకటన ఒకటి వెలువడింది. అయితే అధికారులెవరూ ఈ ప్రకటన చేయకపోవడం గమనార్హం. వైసిపి నేతలు మాత్రం నాలుగేళ్లు వైసిపి పాలన పూర్తయిన సందర్భంగా ఈ బ్రిడ్జిపై స్కూటర్‌ ర్యాలీ చేపట్టి అనధికారికంగా ప్రారంభించేయనుండటం గమనార్హం. ఈ కార్యక్రమంలో అధికారులెవరూ కూడా లేకపోవడం గమనార్హం. ఈ ర్యాలీ తరువాత వెంటనే ఇతర వాహనాలకు అనుమతి లేదని నిర్మాణ సంస్థ అయిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్నందున రెండు రోజుల పాటు వాహనాలకు అనుమతిలేదని, జూన్‌ ఒకటవ తేదీ నుంచి అనుమతి ఉంటుందని చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు మాత్రం ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. బ్రిడ్జి కింద అండర్‌ పాస్‌ నిర్మాణం కూడా పూర్తయ్యాక అధికారిక ప్రారంభముంటుందని చెబుతున్నారు.
ప్రధాన రహదారుల విస్తరణ అంతేనా ?
ఎన్‌హెచ్‌ 44 నుంచి పంగల్‌ రోడ్డు వరకు విస్తరణ చేపట్టే యోచనతో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ మేరకు బళ్లారి బైపాస్‌ నుంచి టవర్‌ క్లాక్‌ బ్రిడ్జి కూడా నాలుగు వరుసలతో నిర్మాణం చేపట్టారు. సప్తగిరి సర్కిల్‌ వరకు ఈ రకంగా నిర్మాణం చేపట్టారు. సప్తగిరి సర్కిల్‌ నుంచి ఐరన్‌ ఓవర్‌ బ్రిడ్జి మధ్య విస్తరణకు మార్కింగు ఇచ్చారు. కాని ఇక్కడున్న నిర్మాణాలు తొలగించాలంటే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సుమారు రూ.80 కోట్ల నిధులు అవసరమయ్యాయి. ఈ నిధులు రాకపోవడంతో ఉన్న రహదారుల్లో కొత్త రోడ్డు వేసి మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారు. సప్తగిరి సర్కిల్‌ విస్తరణ చేపడతామని అందుకు రూ.25 కోట్లు అవసరమవతాయని అధికారులు అంటున్నారు. అయితే ఆ నిధులు కూడా వస్తాయా అన్నది మాత్రం సందేహాస్పదంగానే మారింది. మొత్తం మీద అధికార వైసిపి అనధికారికంగా వంతెన ప్రారంభించనుంది.