May 18,2023 21:47

ఆందోళన చేస్తున విద్యార్థి సంఘాల నాయకులు

        ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌   అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలను సీజ్‌ చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద ఉన్న శ్రీచైతన్య కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్‌, ఎఐఎస్‌బి జిల్లా కార్యదర్శి పృథ్వీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ మాట్లాడుతూ కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యను వాపారంగా మలుచుకున్నాయన్నారు. ముఖ్యంగా నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందే అడ్మిషన్లు ప్రారంభించాయన్నారు. ఈ విషయం తెలిసినా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాల పేరుతో, కళాశాల పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకాలు విక్రయించకూడదన్నారు. అయినప్పటికీ అన్ని విద్యా సంస్థల్లో విక్రమిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా విద్యాసంస్థలు చేస్తున్న విద్యామాఫియాను అరికట్టాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలకు స్వీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివా, రాజేష్‌, చంద్ర, ముస్తఫా, ఎఐఎఎస్‌బి నాయకులు నాగార్జునరెడ్డి, మారుతి, ధనుష్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం నాయకులు అభి, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.