ఆధార్‌తో ఓటర్ కార్డు అనుసంధానం తప్పనిసరి: తహశీల్దార్
ప్రజాశక్తి- యాదమరి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు తహశీల్దార్ వై.చిట్టిబాబు తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక శిబిరాలను ఆయన పరిశీలించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లను కలసి సూచనలు సలహాలు చేశారు. ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేసేందుకు ఓటర్ల దగ్గర ఆసక్తిని తెలియజేస్తూ ఫారం 6బి సమర్పించవలసిందిగా కోరారు. ఈఅవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు లేని పక్షంలో ఎన్నికల సంఘం నుంచి 11రకాల గుర్తింపు కార్డులు ఒకదానిలో అనుసంధానానికి వీలు కల్పించినట్లు వివరించారు. ఇందుకోసం హెల్ప్ లైన్ యాప్‌లతోపాటు ఒటర్ పోర్టల్ ఆధారంగా ఓటర్లు తమ చరవాణిల ద్వారా 6బి దరఖాస్తును పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఉదయం10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసర్లు కచ్చితంగా ఉండాలని తెలిపారు. ఓటర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.










