Jul 28,2022 22:15

ఆధార్‌ అనుసంధానం బిఎల్‌ఓలు, సచివాలయ సిబ్బందితో
ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తాం: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

ఓటర్‌ గుర్తింపు కార్డుకు ఆధార అనుసంధానం చేసే ప్రక్రియను బూత్‌లెవెల్‌ ఆఫీసర్లు సచివాలయ సిబ్బందితో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ రాష్ట్రఎన్నికల ప్రధాన అధికారి (సిఈఓ) ముఖేష్‌ కుమార్‌ మీనాకి వివరించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివిధ జిల్లాల కలెక్టర్లతో ఓటర్‌ గుర్తింపు కార్డులకు ఆధార్‌ అనుసంధానం, కొత్తగా సవరించిన ఫారంలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో ఉండి మరణించిన వారి వివరాలు, డబల్‌ ఎంట్రీలు ఉన్నవారిని ముందుగా బిఎల్‌ఓలు నిర్ధారణ చేసుకుని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆగష్టు 1వ తేదీ నుండి మొదలు కాబోయే ఆధార్‌ అనుసంధానం గురించి 2023 సంవత్సరానికి ప్రత్యేక ఓటర్‌ కార్యక్రమానికి సంబంధించి నిర్ణయించిన తేదీలలో ఓటర్‌ నమోదు కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్‌ గుర్తింపు కార్డుకు ఆధార్‌ అనుసంధాన కార్యక్రమాన్ని వేగవంతం చేసి నిర్దేశించుకున్న గడువు లోపు పూర్తిచేయాలన్నారు. నూతన ఓటర్‌ జాబితా ప్రకారం ఓటరు కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అని తెలిపారు. ఈఅంశానికి సంబంధించి అందిన క్లెయిమ్స్‌, తిరస్కరణ పిటీషన్లు, పెండింగ్‌ అంశాలు, బూత్‌లెవెల్‌ ఆఫీసర్‌లు, బూత్‌స్థాయి సహాయకుల నియామకం, డీఈఓ, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓల నియామక ప్రతిపాదనలు, తదితర అంశాల పై తగు సూచనలు చేశారు. జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్‌ గుర్తింపు కార్డులకు ఆధార్‌ అనుసంధానం చేసే ప్రక్రియను బూత్‌ లెవెల్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది సహకారంతో పూర్తి ప్రక్రియను పూర్తిచేస్తామని, సచివాలయాల వారీగా ఈ ప్రక్రియను చేపట్టి వేగవంతం చేస్తామని జిల్లా కలెక్టర్‌ వివరించారు.